ఉక్కు రక్షణకు ఎంతటి పోరాటానికైనా సిద్ధం

May 6,2024 22:36 #Protest, #visaka steel plant
  •  విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారానికి 1180వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్‌ ఎస్‌ఎంఎస్‌ విభాగానికి చెందిన ఉద్యోగులు కూర్చున్నారు. వారినుద్దేశించి పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ విశాఖ ఉక్కును రక్షించుకునే క్రమంలో జరుగుతున్న పోరాటాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, స్టీల్‌ యాజమాన్యం కుట్రలు పన్నుతున్నాయన్నారు. వాటిని పోరాటాలతో తిప్పికొడతామని స్పష్టం చేశారు. పార్లమెంటులో విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించే వరకూ పోరాటం కొనసాగుతుందన్నారు.

➡️