v

నిర్మాణానికి నోచని కమలబంధ రోడ్డు

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మారుమూల గిరిజన గ్రామాల్లో రవాణా సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేసినా స్థానిక అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిర్మాణ పనులు జరగక పోవడంతో గిరిజనులకు రవాణా కష్టాలు తప్ప లేదు. మండలంలోని సొవ్వ పంచాయితీ కమలబంధలో బిటి రోడ్డు నిర్మాణానికి గత 2019లో నిధులు మంజూరైన ఇప్పటికీ సుమారు ఐదేళ్లు గడుస్తున్నా రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించక పోవడమే ఇందుకు నిదర్శనం. సోవ్వ రోడ్డు జంక్షన్‌ నుంచి ఆ గ్రామానికి సుమారు కిలోమీటర్‌ దూరం ఉంటుంది. ప్రస్తుతం ఆ గ్రామంలో మట్టి రోడ్డు ఉన్నప్పటికీ వర్షాకాలంలో రోడ్డు అంతా బురదమయంగా మారుతుండటంతో రవాణా సౌకర్యానికి ఆ గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామానికి బస్సు సౌకర్యం లేక పోవడంతో గ్రామస్తులు ఆటోలు, ద్విచక్ర వాహనాలను ఉపయోగిస్తున్నారు. వర్షాకాలంలో రోడ్డుపైన బురద పేరుకు పోతుండంతో వాహనాలు జారి పోతూ పలు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆ గ్రామస్తులు తెలిపారు. పనులు ప్రారంభానికి శంకుస్థాపన చేసి నిర్మాణాలను చేపట్టకుండా నిలిపేశారు. రోడ్డు పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు పట్టించుకోలేదని ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి కమలబందలో మంజూరైన నిధులతో బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టి రవాణా కష్టాలు తీర్చాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు.

➡️