29 వరకు కాలువల ద్వారా నీరు

  •  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌ రెడ్డి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో తాగునీటి సమస్యను అధిగమించేలా అన్ని సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపే వరకు కాలువల ద్వారా నీటి సరఫరా కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌ రెడ్డి తెలిపారు. ప్రకాశం బ్యారేజీ పరిధిలో ఉన్న అన్ని జిల్లాలకూ ఈ నెల 29 వరకు, నాగార్జున కుడి కాలువ ద్వారా ఈ నెల 25 వరకు నీటి సరఫరా ఉంటుందని వివరించారు. రాష్ట్రంలోని తాగునీటి ఎద్దడిపై సోమవారం సచివాలయం నుంచి సమీక్ష నిర్వహించిన ఆయన, తాగునీటి అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల సమ్మర్‌ స్టోరేజీలను పూర్తిగా నీటితో నింపాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న 1,046 సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులకు గానూ ఇప్పటి వరకు 680 ట్యాంకులు పూర్తిస్థాయిలో నిండాయని, మిగిలిన ట్యాంకులను నింపేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే నీటి ఎద్దడి గల ఆవాసాలకు జూన్‌ నెలాఖరు వరకూ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 234 ఆవాసాలకు ట్యాంకుల ద్వారా నీటి సరఫరా జరుగుతోందని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లోనూ తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూగర్భ జల మట్టాలపైనా ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. జాతీయ ఉపాధి హామీ పథకంపై సమీక్షిస్తూ, రాష్ట్రంలో రోజుకు 22 లక్షల 59 వేల మందికి పని కల్పిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇఎన్‌సి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️