ఈరోజు సాయంత్రంలోపు సిఎం అభ్యర్థిని ఫైనల్‌ చేస్తాం : ఖర్గే

తెలంగాణ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని సాధించిన కాంగ్రెస్‌ … రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి ఎవరనే విషయమై తర్జనభర్జనలాడుతోంది. తెలంగాణ కొత్త సిఎం ఎవరు ? అని ఉత్కంఠ సర్వత్రా నెలకొన్న వేళ … సోమవారం సాయంత్రం 8 గంటలకు కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్‌ ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో రాజ్‌భవన్‌లో కూడా ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. అయితే అనూహ్యంగా చివరి నిమిషంలో సిఎం అభ్యర్థిని కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించలేదు. అయితే, ఈ ఉత్కంఠకు తెరదించేలా.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం ఉదయం కీలక ప్రకటన చేశారు. సిఎం ఎంపిక బాధ్యతను హైకమాండ్‌కు అప్పగిస్తూ నిన్న నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై ఖర్గే ఈరోజు ఉదయం ఓ క్లారిటీ ఇచ్చారు. ఇవాళ సాయంత్రంలోపు సిఎం అభ్యర్థిని ఫైనల్‌ చేస్తామని స్పష్టం చేశారు. కాసేపట్లో పార్లమెంట్‌లోని ఏఐసీసీ చీఫ్‌ ఖర్గే ఛాంబర్‌లో కాంగ్రెస్‌ సమావేశం కానుంది.

నేడు ఖర్గేతో డీకే శివకుమార్‌ సమావేశం…

మరోవైపు కర్నాటక డిప్యూటీ సిఎం డీకే శివకుమార్‌, తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే నేడు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశం కానున్నారు. తెలంగాణ కొత్త సిఎం, మంత్రివర్గ కూర్పుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కొందరు తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కూడా ఢిల్లీకి బయలుదేరివెళ్లారు. వారు కూడా ఖర్గేతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. సిఎం ఎంపికపై సమావేశం జరిగిన గచ్చిబౌలిలోని ఎల్లా హౌటల్‌ నుంచి సీనియర్‌ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ వెళ్లిపోవడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

➡️