రేపు బంగ్లా పార్లమెంటు ఎన్నికలు

Jan 6,2024 21:34 #Bangladesh, #elections

ఢాకా :ప్రపంచాధిపత్య శక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న బంగ్లాదేశ్‌ పార్లమెంటు ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. ఎన్నికలకు ముందే ఫలితం ఖరారైపోయింది. ఈ సారి కూడా షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ పార్టీయే విజయం సాధించబోతున్నదని ఓటింగ్‌ జరగక ముందే చెప్పేస్తున్నారు. ప్రతిపక్ష మితవాద పార్టీ బిఎన్‌పి ఈ ఎన్నికల చట్టబద్ధతను ప్రశ్నించింది. అణచివేత, నిర్బంధాల మధ్య ఈ ఎన్నికలు ఒక ప్రహసనంగా జరగబోతున్నాయని బిఎన్‌పి నాయకులు ఆరోపించారు. ప్రతిపక్షాల ఆరోపణలపై బంగ్లాదేశ్‌ వ్యవసాయ మంత్రి మహ్మద్‌ అబ్దుర్‌ రజాక్‌ మాట్లాడుతూ, జైలులో ఉన్న బిఎన్‌పి నాయకులు స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గనేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పారు. ఎన్నికల సందర్భంగా హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నందునే అరెస్టు చేశామని అన్నారు. ఇదిలా వుండగా బంగ్లా ఎన్నికలపై న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఒక కథనం రాస్తూ, 10 లక్షల మంది బిఎన్‌పి కార్యకర్తలు కోర్టు కేసులను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ఆదివారం నాటి ఎన్నికల కోసం గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 42వేల పోలింగ్‌ కేంద్రాల్లో 11.96కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 27 రాజకీయ పార్టీలకు చెందిన 1500మందికి పైగా అభ్యర్థులు బరిలో వున్నారు. మరో 436మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వందమందికి పైగా విదేశీ పరిశీలకులు ఈ ఎన్నికలను పర్యవేక్షించనున్నారు. వీరిలో భారత్‌ నుండి ముగ్గురు పరిశీలకులు వున్నారు. 8వ తేదీన ఫలితాలు వెలువడుతాయని ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బిఎన్‌పి) ఈ ఎన్నికలను బహిష్కరించడంతో వరుసగా నాల్గవసారి కూడా ప్రధాని హసీనాకి చెందిన పాలక పార్టీ అవామీ లీగ్‌ విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. దేశ రాజ్యాంగ ప్రక్రియకు ఆటంకం కలిగించే ఆలోచనలకు ఆజ్యం పోయవద్దని ఈ వారంలో జాతినుద్దేశించి ప్రసంగిస్తూ హసీనా దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష పార్టీ బిఎన్‌పి ఇచ్చిన 48గంటల సార్వత్రిక సమ్మె శనివారం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైంది. సోమవారం ఉదయంతో ముగియనుంది. ప్రస్తుత ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ఏ ఎన్నికలూ స్వేచ్ఛగా, సక్రమంగా జరగవని బిఎన్‌పి ప్రతినిధి రుహుల్‌ రిజ్వి అన్నారు. ఎన్నికలకు ముందుగా ప్రభుత్వం వేలాదిమంది ప్రత్యర్ధి రాజకీయ నేతలను, మద్దతుదారులను అరెస్టు చేసింది. ఇది ప్రతిపక్షాన్ని స్తంభింపచేసే చర్య అంటూ మానవ హక్కుల గ్రూపులు ఖండించాయి.

➡️