ఇజ్రాయిల్‌ భద్రతా దళంపై ఆంక్షలకు సిద్ధమైన అమెరికా

Apr 21,2024 15:36 #America, #Israel, #Netanyahu, #Sanctions

టెల్‌ అవీవ్‌ :    ఇజ్రాయిల్‌ భద్రతా దళం (ఐడిఎఫ్‌)కిచెందిన నెట్జా యెహుదా బెటాలియన్‌పై అమెరికా ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. వెస్ట్‌ బ్యాంక్‌లోని పాలస్తీనియన్లపై ఈ సైనికుల బృందం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు అమెరికా పేర్కొంది. దీంతో నెట్జా యెహుదా బెటాలియన్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చనున్నట్లు సమాచారం. ఇజ్రాయిల్‌ సైన్యంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తీసుకునే మొదటి చర్యలు ఇవే కానున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.

ఈ చర్యలను ఇజ్రాయిల్‌ అధ్యక్షుడు నెతన్యాహూ ఖండించారు. తమ సైన్యం తీవ్రవాదులైన మాన్‌స్టర్స్‌తో పోరాడుతోందని అన్నారు. ఐడిఎఫ్‌పై ఆంక్షలు విధించడం అసంబద్ధమైన చర్య, నైతికత అత్యల్ప స్థాయి అని  నెతన్యాహూ వ్యాఖ్యానించారు. అమెరికా ఎత్తుగడలకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్‌ ప్రభుత్వం తగిన  చర్యలు తీసుకుంటుందని అన్నారు.

అమెరికా చర్యను ఇజ్రాయిల్‌ మంత్రులు ఇటమార్‌ బెన్‌ జివిర్‌, బెజాలెల్‌ స్కోట్రిచ్‌లు కూడా  వ్యతిరేకించారు. తమ దళాలపై ఆంక్షలు విధించడం ప్రమాదానికి సంకేతమని జివిర్‌ పేర్కొన్నారు. ఈ చర్య తీవ్రమైనదని, తమ బృందాన్ని రక్షించుకుంటామని అన్నారు. అమెరికా ఆంక్షలకు తలొగ్గకూడదని  ఇజ్రాయిల్‌ రక్షణ మంత్రి యోవ్‌ గాలెంట్‌ను వారు కోరారు.

➡️