ఎలిమెంటరీ ఉమ్మడి పరీక్ష రద్దు

ప్రజాశక్తి, అమరావతి :రాష్ట్రంలో ఒకటి నుంచి 8 తరగతి (ఎలిమెంటరీ)లకు ఉమ్మడి పరీక్ష నిర్వహించాలంటూ రాష్ట్రం తెచ్చిన నూతన విధానాన్ని హైకోర్టు రద్దు చేసింది. విద్యా హక్కు చట్టంలోని సెక్షన్‌ 29 ప్రకారం ఎలమెంటరీ విద్యార్థులకు ఉమ్మడి పరీక్ష నిర్వహించడం చెల్లదని హైకోర్టు పేర్కొంది. రాష్ట్రం తెచ్చిన కొత్త విధానం ఎలిమెంటరీ విద్యార్థుల హక్కులను హరించేలా ఉందని చెప్పింది. ఈ పరీక్ష నిర్వహిస్తే విద్యార్థులు ఒత్తిళ్లకు, భయానికి, బాధలకు గురి అవుతారని స్పష్టం చేసింది. కాబట్టి ఎలమెంటరీ విద్యార్థుల తరగతి గది ఆధారిత మదింపు పరీక్ష (సిబిఎ) కోసం తెచ్చిన కొత్త విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రొసీడింగ్స్‌ చెల్లవని జస్టిస్‌ వడ్డిబోయన సుజాత ఇటీవల తీర్పు చెప్పారు.
రాష్ట్రంలో కొత విధానాన్ని 2012-14 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. అసైన్‌మెంట్‌ టెస్ట్‌, యూనిట్‌ టెస్ట్‌, క్వార్టర్లీ, హాఫియర్లీ, వార్షిక పరీక్షలకు బదులు కొత్త విధానం అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత విద్యా ప్రమాణాలను, నైపుణ్యాలను పెంపునకు వీలుగా ఒకటి నుంచి 10వ తరగతి వరకు ఉమ్మడి పరీక్ష విధానాన్ని అమలు చేయడమే లక్ష్యంగా సపోర్టింగ్‌ ది ఆంధ్రాస్‌ లర్నింగ్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ (సాల్ట్‌) పేరుతో కొత్త విధానం తెచ్చింది. 1976 నుంచి ఉన్న జిల్లా కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డ్స్‌ (డీసీఈబీ)లకు పరీక్ష నిర్వహణ బాధ్యత ఇచ్చింది. ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్క్రె వేటు విద్యా సంస్థల్లో ఉమ్మడి పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. సాల్ట్‌ను ప్క్రె వేట్‌ అన్‌ఎయిడెడ్‌ విద్యా సంస్థలకు అమలు చేయడాన్ని యునైటెడ్‌ ప్క్రె వేట్‌ ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూషన్స్‌ ఫెడరేషన్‌, కేవీఆర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ రెండేళ్ల క్రితం సవాల్‌ చేసిన పిటిషన్లను అనుమతిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. కొత్త విధానం అమలుకు అధికారులు ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను కూడా రద్దు చేసింది.

➡️