చైనా ఇంటర్నెట్‌ టెక్నాలజీ టెస్ట్‌ శాటిలైట్‌ విజయవంతం

Dec 30,2023 22:35 #China, #Science, #Space
china-successfully-launches-test-satellite-for-internet-technologies

బీజింగ్‌ : ఇంటర్నెట్‌ టెక్నాలజీ టెస్ట్‌ శాటిలైట్‌ను శనివారం చైనా విజయవంతంగా ప్రయోగించింది. శనివారం ఉదయం లాంగ్‌ మార్చ్‌-2సి రాకెట్‌ ద్వారా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించినట్లు చైనా ప్రభుత్వ అంతరిక్ష సంస్థ చైనా ఏరోస్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కార్పొరేషన్‌ (సిఎఎస్‌సి) తెలిపింది. ఈ ఉపగ్రహాన్ని చైనా అకాడమీ ఆఫ్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ టెక్నాలజీ కార్పొరేషన్‌ (సిఎఎస్‌టి) ద్వారా సిఎఎస్‌సి అభివృద్ధి చేసింది. వాయువ్య చైనాలోని గన్సు ప్రావిన్స్‌లోని జియుక్వాన్‌ శాటిలైట్‌ లాంచ్‌ సెంటర్‌ నుంచి ప్రయోగించారు. ముందుగా నిర్ణయించిన కక్ష్యలోకి ఉపగ్రహం విజయవంతంగా ప్రవేశించిందని సిఎఎస్‌సి తెలిపింది. తాజా విజయంతో చైనా ఏరోస్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కార్పొరేషన్‌ (సిఎఎస్‌సి) ఈ ఏడాదిలో షెడ్యూల్‌ చేసిన మొత్తం 48 మిషన్‌లను పూర్తి చేయడంతోపాటు 2023లో చైనా వార్షిక అంతరిక్ష ప్రయోగ ప్రణాళిక కూడా పూర్తి చేసినట్లు అంతరిక్ష రంగ నిపుణులు తెలిపారు. 2023లో చైనా దాదాపు 70 రాకెట్‌ ప్రయోగాలను నిర్వహించింది. వీటిలో 47 ప్రయోగాలను లాంగ్‌ మార్చ్‌ రాకెట్‌ ద్వారా నిర్వహించడం మరో విశేషం. శనివారం సిఎఎస్‌సి విడుదల చేసిన ఒక అధికారిక పత్రికా ప్రకటన ప్రకారం, ఈ ఏడాదిలో 130 వ్యోమనౌకలను ముందుగా నిర్దేశించిన కక్ష్యలలోకి పంపింది. వీటిలో ల్యాండ్‌ సర్వే 4 01తోపాటు పలు కీలక సేవలను అందించే శాటిలైట్లు ఉన్నాయి. ల్యాండ్‌ సర్వే 4 01 ఉపగహ్రం ‘ప్రపంచంలోని మొట్టమొదటి హై-ఆర్బిట్‌ సింథటిక్‌ ఎపర్చర్‌ రాడార్‌ ఉపగ్రహం’గా గుర్తించబడింది. ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ నిరంతరం మన భూ గ్రహాన్ని పరిశీలిస్తుంది. దీంతో వివిధ విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు. చైనా ఈ నవంబరులో కొత్త తరం ఓషన్‌ కలర్‌ మానిటరింగ్‌ శాటిలైట్‌లను అంతరిక్షంలోకి విజయవంతంగా పంపింది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి హై-ప్రెసిషన్‌ ఓషన్‌ కలర్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌గా రికార్డులకెక్కింది. ఇది ప్రపంచంలోని వివిధ నీటి వనరులను, వాటి సామర్థ్యాలను అంచనా వేస్తుంది. 2023లో ప్రయోగించిన 100 జిబిపిఎస్‌ సామర్థ్యం ఉన్న ఝాన్‌గ్సాంగ్‌ 26 ఉపగ్రహం కూడా పేర్కొనదగినది. చైనా తన అంతరిక్ష విజయాల్లో ఇతర దేశాలను కూడా భాగస్వామ్యం చేస్తోంది. ఇందుకు చైనా, ఈజిప్ట్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన శాట్‌-2 ఉపగ్రహాన్ని సరైన ఉదాహరణ. ఈ ఉపగ్రహ పరీక్ష విజయవంతం కావడం చైనా-అరబ్‌, చైనా-ఆఫ్రికన్‌ బంధాలకు, బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ యొక్క అభివృద్ధికి గణనీయంగా దోహదం చేస్తుంది. 2023లో చైనా కృత్రిమ ఉపగ్రహాల ప్రయోగంతోపాటు, ఉపగ్రహ ప్రయోగ వాహనాలు, మానవ సహిత అంతరిక్ష యాత్రలు వంటి అంశాల్లోనూ చైనా సుస్థిరమైన, గణనీయమైన అభివృద్ధిని నమోదు చేసింది.

➡️