ముగ్గురు సైనిక ఉన్నతాధికారులకు మరణశిక్ష

 మరో ముగ్గురికి జీవిత ఖైదు

యాన్‌గాంన్‌ (మయన్మార్‌) :   మయన్మార్‌లో ముగ్గురు సైనిక ఉన్నతాధికారులకు అక్కడి జుంటా ప్రభుత్వం మరణశిక్ష విధించింది. మయన్మార్‌-చైనా సరిహద్దుల్లో ఉన్న లౌక్కై అనే పట్టణాన్ని తిరుగుబాటుదారులు గత నెలలో స్వాధీనం చేసుకున్నారు.  లౌక్కై పట్టణాన్ని రక్షించడంలో విఫలం చెందారనే ఆరోపణలతో ఈ పట్టణ కమాండర్‌తో సహా ముగ్గురు బ్రిగేడియర్‌ జనరల్స్‌కు మరణశిక్ష విధించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇదే ఆరోపణలతో మరో ముగ్గురు బ్రిగేడియర్‌ జనరల్స్‌కు జీవిత ఖైదు విధించారు. ఈ విషయాన్ని కొంత మంది సైనిక అధికారులు కూడా ద్రువీకరించారు.

గత నెలలో షాన్‌ రాష్ట్రంలో ఉన్న లౌక్కై పట్టణాన్ని మయన్మార్‌ నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయిన్స్‌ ఆర్మీ (ఎంఎన్‌డిఎఎ), అరకాన్‌ ఆర్మీ (ఎఎ), తాంగ్‌ నేషనల్‌ లిబరేషన్‌ ఆర్మీ (టిఎన్‌ఎల్‌ఎ) అనే తిరుగుబాటు కూటమి స్వాధీనం చేసుకుంది. జుంటా సైన్యం నుంచి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకుని సైనికులను అక్కడ నుంచి వెళ్లిపోవడానికి అనుమతించింది. 2021లో మయన్మార్‌లోని ఆంగ్‌సాన్‌ సూకీ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని గద్దెదించి  జుంటా సైన్యం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి జుంటా సైన్యానికి, తిరుగుబాటుదారులకు మధ్య పోరాటం సాగుతోంది. కీలకమైన లౌక్కై పట్టణాన్ని తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకోవడం జుంటా సైన్యానికి పెద్ద ఎదురుదెబ్బగా నిపుణులు భావిస్తున్నారు.

➡️