కెన్యాలో ఆరని నిరసన జ్వాల..23కి పెరిగిన మృతులు

Jun 26,2024 23:25 #flame, #protest in Kenya

బిల్లును రద్దు చేసేవరకు ఆందోళన విరమించేది లేదన్న నిరసనకారులు
నైరోబి : కెన్యాలో పన్నుల పెంపు బిల్లును నిరసిస్తూ నిరసనలు తెలియచేస్తున్న వారిపై పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య 23కి చేరింది. తమ ఆందోళనలను అణచివేయడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా తాము వెనక్కి తగ్గేది లేదని, తమ నిరసనలు కొనసాగిస్తామని బుధవారం ఆందోళనకారులు ప్రతిన బూనారు దేశ వ్యాప్తంగా జరిగిన ఘర్షణలు, కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. ఇంత పెద్దయెత్తున నిరసనలకు దారి తీసిన ఈ వివాదాస్పద ఆర్థిక బిల్లుపై సంతకం చేయడానికి అధ్యక్షుడు విలియం రూటో బుధవారం తిరస్కరించారు. బిల్లులో సవరణలు చేయాల్సిందిగా తిరిగి పార్లమెంట్‌కు పంపారని కెన్యా స్టార్‌ వార్తాపత్రిక పేర్కొంది. బిల్లులో ఆయన కొన్ని సవరణలను ప్రతిపాదించారని, వాటిని పార్లమెంట్‌ పరిశీలించాల్సి వుందని తెలుస్తోంది. కాగా, నిరసనలను అణచివేయడానికి పోలీసులకు సహకరించేందుకు సైన్యాన్ని కూడా రంగంలోకి దించినట్లు రక్షణ మంత్రి అడెన్‌ డూలే తెలిపారు. దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నందున అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిందిగా భారతీయులకు కెన్యాలోని భారత హై కమిషన్‌ సూచనలు జారీ చేసింది. అనవసరంగా బయటి ప్రయాణాలు చేయరాదని, ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్ళవద్దని సూచించింది.
కెన్యా ఆర్థిక వ్యవస్థను రుణ సంక్షోభం నుండి బయటపడవేసేందుకు 210కోట్ల పౌండ్లను సమీకరించడం ఈ వివాదాస్పద బిల్లు లక్ష్యంగా వుంది. బ్రెడ్‌, వంట నూనెలు, ఇతర సరుకులపై కొత్తగా విధించిన పన్నులను రద్దు చేసేందుకు సవరణలు చేశారు. కానీ మొత్తంగా బిల్లును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అసలు బ్రెడ్‌పై 16శాతం పన్ను ఎలా విధిస్తారు, శానిటరీ ప్యాడ్‌లపై మీరెలా పన్ను వేస్తారో అర్ధం కావడం లేదని 24ఏళ్ళ ఆందోళనకారుడు డెరిక్‌ మావతు ప్రశ్నించారు.
పేద ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తానని వాగ్దానం చేసి దాదాపు రెండేళ్ళ క్రితం అధ్యక్షుడు రూటో ఎన్నికల్లో గెలుపొందారు. అయితే, మరిన్ని నిధులు విడుదల చేయాలంటే ముందుగా ఆర్ధిక లోటును తగ్గించాలంటూ ఐఎంఎఫ్‌ వంటి అంతర్జాతీయ రుణదాతలు ఒత్తిడి తీసుకువస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆందోళనలు తలెత్తాయి. కాగా, అధ్యక్షుడు రూటో తక్షణమే రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. ఆయన లేకపోతేనే అన్నీ సవ్యంగా సాగుతాయని అన్నారు.

➡️