తీరుమారని ఇజ్రాయిల్‌

Apr 16,2024 22:30 #Hamas, #issrel, #War
  • యుద్ధోన్మాదంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు
  • ఇరాన్‌కు దీటుగా బదులిస్తామన్నఆర్మీ చీఫ్‌

టెల్‌అవీవ్‌ : శాంతి, సంయమనం పాటించాలని ప్రపంచమంతా పదేపదే విన్నవిస్తున్నా ఇజ్రాయిల్‌ తీరు మారడం లేదు. గాజాలో పాలస్తీనీయన్లపై యుద్ధనేరాలకు పాల్పడటమే గాకుండా ఇప్పుడు ఇరాన్‌పైనా పదేపదే కాలుదువ్వుతోంది. గత వారాంతంలో ఇరాన్‌ జరిపిన క్షిపణుల దాడికి తమ దేశం కూడా దీటుగా స్పందిస్తుందని ఇజ్రాయిల్‌ మిలటరీ చీఫ్‌ యుద్ధోన్మాదంతో ఊగిపోతూ ప్రకటించారు. మధ్యప్రాచ్యంలో ఘర్షణలు, ఉద్రిక్తతలు పెచ్చరిల్లకుండా నివారించాల్సిందిగా పలు పశ్చిమ దేశాలు ఇజ్రాయిల్‌ను కోరుతున్నా..ఆ మాటలను అది చెవికెక్కించుకోవడం లేదు. మిలటరీ చీఫ్‌ ప్రకటన తర్వాత 24 గంటల్లో ఇజ్రాయిల్‌ వార్‌ కేబినెట్‌ను ప్రధాని నెతన్యాహు సమావేశపరిచారు. అయితే ఇరాన్‌ జరిపిన దాడికి తమ దేశం బదులిస్తుందని మాత్రమే మిలటరీ చీఫ్‌ చెప్పారు కానీ వివరాలు వెల్లడించలేదు. దక్షిణ ఇజ్రాయిల్‌లో నెవటిమ్‌ ఎయిర్‌ బేస్‌ వద్ద ఆయన మాట్లాడారు. డమాస్కస్‌లో ఇరాన్‌ ఎంబసీపై దాడికి ప్రతిగా ఇరాన్‌ దాడిచేయడంతో ఇజ్రాయిల్‌, ఇరాన్‌ మధ్య యుద్ధం చెలరేగే భయాందోళనలు ఎక్కువయ్యాయి. ‘మనం ప్రమాదపుటంచుల్లో వున్నాం. ఇక్కడ నుండి దూరంగా వెళ్ళాల్సి వుంది’ అని యురోపియన్‌ యూనియన్‌ విదేశీ వ్యవహారాలు, భద్రతా విధాన ప్రతినిధి జోసెఫ్‌ బోరెల్‌ వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్‌ అధ్యక్షులు మేక్రాన్‌, జర్మనీ ఛాన్సలర్‌ ఓల్ఫ్‌ షుల్జ్‌, బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డేవిడ్‌ కామెరూన్‌ ప్రభృతులు కూడా ఇదే తరహాలో హితవు పలికారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్‌ కూడా సంయమనం పాటించాలంటూ పిలుపిచ్చారు. మరిన్ని యుద్ధాలను ఇక ప్రపంచం గానీ ఈ ప్రాంతం గానీ భరించలేదని గుటెరస్‌ వ్యాఖ్యానించారు. ఇక ఉద్రిక్తతల నివారణకు కృషి చేయాల్సిన సమయం ఆసననమైందని అన్నారు. ఉద్రికత్తలు పెచ్చరిల్లడం ఎవరి ప్రయోజనాలకు మంచిదికాదని క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ పేర్కొన్నారు.

➡️