ఎల్‌ఇటి వ్యవస్థాపకుల్లో ఒకరైన హఫీజ్‌ అబ్దుల్‌ మృతి :యుఎన్‌

 జెనీవా :   లష్కరే తొయిబా (ఎల్‌ఇటి) వ్యవస్థాపకుల్లో ఒకరైన హఫీజ్‌ అబ్దుల్‌ సలామ్‌ బుట్టావి మరణించినట్లు శుక్రవారం ఐక్యరాజ్యసమితి (యుఎన్‌) ధృవీకరించింది. పాకిస్థాన్‌ ప్రభుత్వం కస్టడీలో ఉన్న అతను గుండెపోటుతో మరణించినట్లు తెలిపింది. బుట్టావి గతేడాది మే 29న పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో మురిడ్కే నగరంలో మరణించినట్లు యుఎన్‌ భద్రతా మండలికి చెందిన అల్‌ఖైదా ఆంక్షల కమిటీ ప్రకటించింది.

2002లో లాహోర్‌లో ఎల్‌ఇటిని స్థాపించడంలో బుట్టావి కీలక పాత్ర పోషించారు. ఎల్‌ఇటి మదర్సా నెట్‌వర్క్‌కు కూడా బాధ్యత వహించారు. 26/11 ముంబయి దాడుల కీలక సూత్రధారి సయీద్‌కు డిప్యూటీగా ఉన్నాడు. ముంబయి దాడి కోసం కార్యకర్తలను సిద్ధం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. సయీద్‌ను నిర్బంధించినపుడు, బుట్టావి తాత్కాలిక ఎమిర్‌గా పనిచేశారు. ఆ సమయంలో పలు స్వతంత్ర నిర్ణయాలు తీసుకున్నారు.    సయీద్‌ ప్రస్తుతం పాకిస్థాన్‌ ప్రభుత్వ కస్టడీలో ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి కమిటీ స్పష్టం చేసింది.  ఉగ్రవాద సంస్థలకు నిధులు అందించారన్న కేసులో  దోషిగా తేలిన  73 ఏళ్ల సయీద్‌   78 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నాడు.

➡️