ఆ సిబ్బందిని కలుసుకోవచ్చు !

  • భారత అధికారులకు ఇరాన్‌ హామీ

ఇరాన్‌ : ఇరాన్‌ స్వాధీనం చేసుకొన్న నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిని మన దేశ అధికారులు కలిసేందుకు అనుమతి లభించింది. ఇజ్రాయెల్‌ తో ఉద్రిక్తతల వేళ భారత్‌కు వచ్చే ఓ నౌక ను ఇరాన్‌ స్వాధీనం చేసుకోవడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. నౌకలోని భారతీయ సిబ్బందిని మన దేశ అధికారులు కలిసేందుకు అనుమతినిచ్చినట్లు ఇరాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది.

గత శనివారం హర్మూజ్‌ జలసంధి సమీపంలో ఇజ్రాయెలీ కుబేరుడికి చెందిన వాణిజ్య నౌక ఎంఎస్‌సీ ఏరిస్‌ను ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ దళం హెలికాప్టర్లతో వెంబడించి స్వాధీనంలోకి తీసుకొంది. నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 17 మంది భారతీయులే ఉన్నారు. ఈ క్రమంలోనే వారిని రక్షించేందుకు భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఆదివారం ఇరాన్‌ విదేశాంగశాఖ మంత్రి హొస్సేన్‌ అమీర్‌ అబ్దుల్లాహియాన్‌ను సంప్రదించారు. నౌకలోని భారతీయులను విడుదల చేయాలని కోరారు. పశ్చిమాసియాలో ఘర్షణలను నివారించాలని, దౌత్య మార్గాల్లో పరిష్కారం కనుగొనాలని ఆయన సూచించారు. ఈ పరిణామాల వేళ ఇరాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం దీనిపై ఓ ప్రకటన జారీ చేసింది. ”స్వాధీనం చేసుకున్న నౌక వివరాలను తెలుసుకుంటున్నాం. త్వరలోనే అందులోని భారతీయ సిబ్బందిని న్యూఢిల్లీ ప్రతినిధులు కలిసేందుకు ఏర్పాట్లు చేస్తాం” అని వెల్లడించింది. ప్రస్తుతం ఆ నౌక ఇరాన్‌ ప్రాదేశిక జలాల్లో ఉంది.

మరింత సమాచారం కోసం …

ఇజ్రాయిల్‌ నౌకను సీజ్‌ చేసిన ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌

➡️