గాజాలో మూడొంతులు ధ్వంసం !

May 9,2024 00:12 #Gaza

ఐదు ఆస్పత్రులు నేలమట్టం
శాటిలైట్‌ వ్యూలో వెల్లడి
గాజా : గత ఏడు మాసాలుగా గాజాపై జరుగుతున్న యుద్ధంలో మూడు వంతులకు పైగా నగరం నేలమట్టమైందని, ఐదు ఆస్పత్రులు శిధిలాల కుప్పలుగా మారాయని ఉపగ్రహ ఛాయా చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. జనాభాతో కిక్కిరిసి పోయిన రఫాలోకి ఇంకా పదాతిదళాలు ప్రవేశించడానికి ముందుగానే మొత్తంగా ఆ ప్రాంతమంతా ధ్వంసమైంది. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో నష్టాన్ని, విధంసాన్ని తాము చూడలేదని, అధ్యయనం చేయలేదని న్యూయార్క్‌ యూనివర్శిటీలో పిహెచడ్‌ చేస్తున్న కారే సచెర్‌ వ్యాఖ్యానించారు. గాజా ఉపగ్రహ చిత్రాలపై ఆయన అధ్యయనం చేస్తున్నారు. ఈ భూమండలంపై అత్యంత జన సాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఒకటైన గాజాలో యుద్ధం మొదలవడానికి ముందు 23లక్షల మంది ప్రజలు నివసించేవారు. కేవలం 365 చదరపు కిలోమీటర్ల భూభాగంపైనే వీరందరూ మనుగడ సాగిస్తున్నారు.
ఏప్రిల్‌ 21నాటికి గాజా భవనాల్లో 56.9శాతం ధ్వంసమయ్యాయి. దాడులు జరపడం ఆరంభించిన మొదటి రెండు మూడు నెలల్లోనే చాలా వేగంగా విధ్వంసం చోటు చేసుకుందని సచెర్‌, ఓరెగావ్‌ యూనివర్శిటీలో భౌగోళిక శాస్త్ర అసోసియేట్‌ ప్రొఫెసర్‌ అయిన జమాన్‌ వాన్‌ డెన్‌ హోక్‌లు తెలిపారు. అయిదు ఆస్పత్రులు నేలమట్టమయ్యాయి. ప్రతి మూడు ఆస్పత్రుల్లో ఒకటి కేవలం పాక్షికంగా పనిచేస్తోంది. 70శాతానికి పైగా పాఠశాలలు రాళ్ళ గుట్టలుగా మారాయి. ఇక ఆరాధనా స్థలాలకు వస్తే 61.5శాతం మసీదులు ధ్వంసమయ్యాయి. రెండో ప్రపంచ యుద్దంలో బాగా ధ్వంసమైన జర్మన్‌ నగరం డ్రెస్డన్‌ కన్నా గాజాలో విధ్వంసం స్థాయి ఎక్కువగా వుందని వారు వ్యాఖ్యానించారు.

➡️