ఢిల్లీ సరిహద్దుల్లో భారీ భద్రత.. కేంద్రం కీలక ఆదేశాలు..

Feb 21,2024 15:19 #formers andholana, #New Delhi

న్యూ ఢిల్లీ : పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం కోసం ఆందోళన చేస్తున్న రైతులు.. కేంద్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ విధించారు. బుధవారం ఉదయం 11 గంటల వరకు.. ప్రభుత్వం స్పందించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఛలో ఢిల్లీ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. పంజాబ్‌-హర్యానా సరిహద్దు అయిన శంభు బోర్డర్‌ నుంచి ఢిల్లీ వైపు బయల్దేందుకు రైతులు సిద్ధమయ్యారు. ఢిల్లీ దిశగా ట్రాక్టర్లు, ట్రాలీలతోనే బయల్దేరాలని నిర్ణయించారు. ఈసారి పోలీసుల టియ్యర్‌ గ్యాసుల ప్రయోగం, పిల్లెట్స్‌, వాటర్‌ కెనాన్ల నుంచి తప్పించుకునేందుకు ఫుల్‌ ప్రిపేర్డ్‌గా రైతులు వెళ్తున్నారు. భాష్పవాయు గోళాల నుంచి రక్షణ కల్పించేందుకు ముఖాలకు అడ్వాన్డ్స్‌ మాస్కులు, హెల్మెట్లతో పాటు.. ఇనుప షీల్డులతో ముందుకెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. డ్రోన్లను కూల్చేందుకు పతంగులు సిద్ధం చేశారు. టియ్యర్‌ గ్యాస్‌ వ్యాపించకుండా అడ్డుకునేందుకు ఉప్పు ప్యాకెట్లను, గోనె సంచులు కూడా రెడీ చేసుకున్నారు రైతులు. కాంక్రీట్‌ బ్లాక్‌లు, బారికేడ్లు, ఇనుప కంచెలు తొలగించేందుకు.. జేసీబీలను రెడీ చేసుకున్నారు.డెడ్‌లైన్‌ ముగిసిన తర్వాత ఢిల్లీ వైపు తమ ప్రయాణం కొనసాగిస్తామని రైతు నాయకులు స్పష్టం చేశారు. ఇకపై ఏం జరిగినా కేంద్రమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. కేంద్రం వెంటనే.. ఒక రోజు పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరపై చట్టాన్ని ఆమోదించాలంటున్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు.. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు, గత రైతు ఉద్యమంలో చనిపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.తమని ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీలో అడుగుపెట్టనివ్వకూడదని కేంద్ర ప్రభుత్వ ఉద్దేశంలా కనిపిస్తోందని రైతులు అన్నారు. రైతులను ఎక్కడికక్కడ నిర్భందిస్తున్నారని, హర్యానా కశ్మీర్‌ను తలపిస్తోందన్నారు. తాము పంట పండించే రైతులమని, హింస తమకు అవసరం లేదని,.. శాంతినే కోరుకుంటున్నామని చెప్పారు. చర్చల ద్వారా పరిష్కారం కావాలనుకుంటే ఢిల్లీవైపు తమను అనుమతించాలని కోరుతున్నారు. కేంద్రం తమ డిమాండ్లపై ఒకడుగు ముందుకేస్తే.. రెండు అడుగులు ముందుకు వేసేందుకు తామూ సిద్ధంగా ఉన్నామని రైతు నాయకులు స్పష్టం చేస్తున్నారు.కాగా.. రైతుల ఛలో ఢిల్లీ కారణంగా సరిహద్దుల్లో టెన్షన్‌ వాతావరణం కొనసాగుతోంది. రైతులు దూసుకొచ్చే అవకాశం ఉందని.. ఢిల్లీ సరిహద్దుల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కాంక్రీట్‌ బ్లాక్‌లు, బారికేడ్లు, ఇనుప కంచెలు, కంటైనర్ల గోడలతో ఢిల్లీవైపు వచ్చే దారులు మూసివేశారు. ఘాజీపూర్‌ సరిహద్దు దగ్గర భారీగా బలగాలను మోహరించారు. సింఘు, టిక్రి సరిహద్దులను క్లోజ్‌ చేశారు. సరిహద్దులో రోడ్లపై పెద్ద సంఖ్యలో పోలీసుల్ని మోహరించారు. వందలాదిగా సిమెంట్‌ దిమ్మల్ని అడ్డంగా పెట్టేశారు. అటు, రోడ్ల దిగువ నుంచి టాక్టర్లు రాకుండా జేసీబీలతో కందకాలు తవ్వించారు. బోర్డర్‌లో భారీగా అంబులెన్స్‌లు కూడా ఏర్పాటు చేశారు.శంభు బోర్డర్‌ దగ్గర 14 వేల మంది రైతులు ఉన్నారు. మొత్తం 12వందల ట్రాక్టర్లు, 300 కార్లు, 10 మినీ బస్సుల్లో రైతులు ఢిల్లీ బయల్దేరేందుకు సిద్ధం అయ్యారు. దీంతో.. పంజాబ్‌ ప్రభుత్వానికి కేంద్ర హౌంశాఖ లేఖ రాసింది. శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే ఉపేక్షించవద్దని సూచించింది. రైతుల ముసుగులో సంఘవిద్రోహ శక్తులు అశాంతి సఅష్టించే ప్రయత్నం చేస్తున్నాయని హెచ్చరించింది. రాళ్లు, భారీ యంత్రాలను శంభు బోర్డర్‌ వైపు తరలించడంపై కేంద్ర హౌంశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది.

➡️