మధుర వివాదంపై సుప్రీం స్టే

Jan 17,2024 09:56 #Mathura dispute, #stay, #Supreme Court

న్యూఢిల్లీ : కృష్ణ జన్మ స్థలం – షాహీ ఈద్గాకు సంబంధించిన కేసులో మంగళవారం సుప్రీం కోర్టు కీలకమైన తీర్పు వెలువరించింది. మధురలోని షాహీ ఈద్గా ఆవరణలో సర్వే కోసం కమిషన్‌ను నియమించాలంటూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన బెంచ్‌ స్టే ఇచ్చింది. ”సిపిసిలోని 9వ నిబంధన ఆర్డర్‌ 26 కింద కమిషన్‌ను నియమించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో మీరు చాలా నిర్దిష్టంగా, స్పష్టంగా చెప్పాల్సి వుంది. మీరు చేసిన విజ్ఞప్తి అస్పష్టంగా వుంది. కమిషన్‌ ఏర్పాటు కోసం మీరు దరఖాస్తును సమర్పించలేరు.” అని జస్టిస్‌ ఖన్నా హిందువుల తరపు వాదనలు వినిపిస్తున్న శ్యామ్‌ దివాన్‌కు స్పష్టం చేశారు. ఈద్గా వున్న స్థలంలో ఒకప్పుడు ఆలయం వుండేదని, ఆ ప్రాంతాన్ని శ్రీ కృష్ణ జన్మభూమిగా ప్రకటించాలంటూ హిందువులు కొంతమంది పెట్టుకున్న పిటిషన్‌ విచారణకు అర్హమా కాదా అన్న అంశంపై సిపిసిలోని 11వ నిబంధన ఆర్డర్‌ 7 కింద కార్యకలాపాలన్నీ పెండింగ్‌లో వున్నాయి. ఈ అంశంపై సుప్రీం కోర్టు జోక్యం చేసుకోలేదు. కమిషన్‌ ఏర్పాటును వ్యతిరేకిస్తూ మాత్రమే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిషన్‌ అమలు కాదని జస్టిస్‌ ఖన్నా తన తీర్పులో స్పష్టం చేశారు. గతేడాది డిసెంబరులో అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీం ఈ స్టే మంజూరు చేసింది. అసలు పిటిషన్‌పైనే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో వున్నప్పుడు ఇలా కమిషన్‌ను నియమించడం ద్వారా హైకోర్టు తాత్కాలిక రిలీఫ్‌ను ఇవ్వరాదంటూ ఈద్గా నిర్వహణా ట్రస్ట్‌ తరపు న్యాయవాది తన్సీమ్‌ అహ్మది వాదించారు. ఈ కేసుపై తదుపరి విచారణను జనవరి 23కి కోర్టు వాయిదా వేసింది.

➡️