బెంగళూరులో రోజుకు 50 కోట్ల లీటర్ల నీటి కొరత : సిద్ధరామయ్య

బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులో తీవ్ర నీటి సంక్షోభం నెలకొంది. రోజుకు 2600 ఎంఎల్‌డీ (మిలియన్‌ లీటర్స్‌ పర్‌ డే) నీటి అవసరం ఉండగా.. దాదాపు 500 ఎంఎల్‌డీ కొరత ఉందని కర్ణాటక సిఎం సిద్ధరామయ్య తెలిపారు. సోమవారం అధికారులతో సమావేశమైన ఆయన.. సమస్య పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. తాగునీటి సరఫరాకు నిధుల కొరత లేదని, భవిష్యత్తులో ఈ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ”బెంగళూరులో మొత్తం 14 వేల బోరుబావులు ఉన్నాయి. వాటిలో 6900 ఎండిపోయాయి. కొన్ని జలవనరులు ఆక్రమణకు గురయ్యాయి. మహానగరానికి రోజుకు 2600 ఎంఎల్‌డి నీళ్లు అవసరం. కావేరి నుంచి 1470 ఎంఎల్‌డి వస్తున్నాయి. 650 ఎంఎల్‌డి బోరుబావుల నుంచి తీసుకుంటున్నాం. జూన్‌లో ప్రారంభం కానున్న ‘కావేరీ ఫైవ్‌ ప్రాజెక్టు’ ద్వారా చాలావరకు ఇక్కట్లు తీరతాయి. తాగునీటి అవసరాలకు కావేరి, కాబిని జలాలు జూన్‌ వరకు సరిపోతాయి. 313 చోట్ల కొత్తగా బోరు బావులు తవ్విస్తాం. 1,200 పునరుద్ధరిస్తాం” అని సీఎం సిద్ధరామయ్య తెలిపారు.

➡️