ఒడిశాలో అంగన్‌వాడీల వేతనాల పెంపు

Mar 1,2024 10:25 #Anganwadis, #Odisha, #salary

భువనేశ్వర్‌ : ఒడిశాలోని లక్షా 48 వేల అంగన్‌వాడీ ఉద్యోగుల వేతనాలను పెంచుతున్నట్లు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రకటించారు. త్వరలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిజెడి ప్రభుత్వం గురువారం ఈ నిర్ణయం తీసుకుంది. అంగన్‌వాడీ వర్కర్ల నెలవారీ వేతనాన్ని రూ.7,500 నుంచి రూ.10,000కు, మినీ అంగన్‌వాడీ వర్కర్లకు రూ.5,375 నుంచి రూ.7,250కు పెంచారు. అంగన్‌వాడీ సహాయకులకు రూ.3,750 నుంచి రూ.5,000కి పెంచారు. 2023 అక్టోబర్‌ నుంచి వేతనాల పెంపు అమల్లోకి వస్తుందని, నాలుగు మాసాల ఇంక్రిమెంట్లను బ్యాంక్‌ అకౌంట్లలో జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. అలాగే ఎగ్జిట్‌ పాలసీకి సంబంధించి అంగన్‌వాడీ వర్కర్లు విధుల నుంచి విరమించుకున్నప్పుడు ఇచ్చే 40 వేల రూపాయలను లక్ష రూపాయలకు, మినీ వర్కర్లకు రూ. 30 వేలను రూ. 75వేలకు, అసిస్టెంట్లకు రూ.20 వేలను రూ. 30 వేలకు పెంచారు. అలాగే విధుల్లో ఉండగా చనిపోతే చెల్లించే ఎక్స్‌గ్రేషియాను రూ.2 లక్షలుకు, పాక్షికంగా అంగవైకల్యం సంభవిస్తే అందించే సాయాన్ని లక్ష రూపాయలకు పెంచారు.

➡️