Arvind Kejriwal : జోక్యం చేసుకోలేం

కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రిగా కొనసాగడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన
పిల్‌ను కోట్టేసిన ఢిల్లీ హైకోర్టు
ప్రజాశక్తి – న్యూఢిల్లీ :కేజ్రివాల్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయనను ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించడానికి ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ విషయంలో న్యాయపరంగా జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అవకాశం లేదని, పాలనా పరమైన జోక్యం చేసుకోలేమని వ్యాఖ్యానించింది. ఢిల్లీ మధ్యం విధానం కేసులో అరెస్టయిన కేజ్రివాల్‌ ఇడి కస్టడీలో వుంటూనే పాలన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ అధికారంతో ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్నారో వివరణ ఇవ్వాలంటూ సూర్జిత్‌ సింగ్‌ యాదవ్‌ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు వేశారు. ముఖ్యమంత్రిగా కేజ్రివాల్‌ను కొనసాగించడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ కూలిపోవడానికి దారి తీస్తుందని యాదవ్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపైకోర్టు స్పందిస్తూ, ‘ఇందులో న్యాయపరమైన జోక్యానికి అవకాశం లేదని కోర్టు అభిప్రాయపడుతోందని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్‌, జస్టిస్‌ మమీత్‌ అరోరాలతోకూడిన బెంచ్‌ వ్యాఖ్యానించింది. జైలు నుండి ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించకపోవడానికి అడ్డుపడుతున్న చట్టపరమైన కారణాలు ఏమైనా వుంటే అవి చూపించాలని కోర్టు యాదవ్‌ను కోరింది. రాజ్యాంగ వైఫల్యం వున్నట్లైతే, రాష్ట్రపతి దానిపై చర్య తీసుకుంటారు. లేదా గవర్నర్‌ పరిశీలిస్తారు, అంతేకానీ న్యాయ స్థానాలు ఏ చర్య తీసుకోలేవని హైకోర్టు పేర్కొంది. ఆచరణాత్మకమైన ఇబ్బందులు వుండి వుండవచ్చు, ఈ రోజు కూడా ముఖ్యమంత్రి ముందు ఫైల్‌ వుంచమని చీఫ్‌ సెక్రటరీని కోరిన విషయం తెలుసు, ఇది ఎలా జరుగుతుందన్నది మాకు తెలియదు,కానీ ఇవి ఆచరణలో ఇబ్బందులేనని కోర్టు పేర్కొంది. 239ఎబి నిబంధనను హైకోర్టు ఉపయోగించలేదు. అది గవర్నర్‌ అధీనంలో వున్న విషయం, అవసరమైతే రాష్ట్రపతి దగ్గరకు వెళ్లాల్సిన అంశం. కానీ మీరు (పిటిషనర్‌) మమ్మల్ని కోరుతున్నారు. కానీ ఇది మా పరిధిలో లేదు.” అని బెంచ్‌ పేర్కొంది.
నా భర్తను వేధిస్తున్నారు : సునీత కేజ్రివాల్‌
మద్యం విధానం కేసులో అరెస్టు చేసిన తన భర్తను ఇడి అధికారులు తీవ్రంగా వేధిస్తున్నారని అరవింద్‌ కేజ్రివాల్‌ భార్య సునీతా కేజ్రివాల్‌ చెప్పారు. తన భర్త ఆరోగ్యం బాగా లేదని, షుగర్‌ లెవెల్స్‌ ఒడిదుడుకులకు గురవుతున్నాయని తెలిపారు. ప్రతి రోజూ రెండు పరీక్షలు చేయడానికి అనుమతించారని, డాక్టర్ల సలహా ప్రకారం ఇంటి భోజనానికి కూడా అనుమతించారని చెప్పారు. అరవింద్‌ చాలా ధైర్యవంతుడని, దేశభక్తిపరుడని, ఆయన పట్టుదల, దీక్ష కూడా చాలా బలంగా వుంటాయని ఆమె పేర్కొన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ పాలన ఇక ఎన్నాళ్ళో సాగదని, ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆమె వ్యాఖ్యానించారు. గురువారంతో ఇడి కస్టడీ ముగియనుండడంతో కేజ్రివాల్‌ను కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువచ్చారు. అక్కడకు వచ్చిన సునీత విలేకర్లతో మాట్లాడారు.

➡️