భారత్‌ జోడో న్యారు యాత్రకు అనుమతినివ్వని అస్సాం సిఎం : జైరాం రమేశ్‌

లఖింపూర్‌ (అస్సాం) : జనవరి 23న గౌహతిలో నిర్వహించనున్న భారత్‌ జోడో న్యారు యాత్ర కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ పేర్కొన్నారు. శనివారం అస్సాంలోని లఖింపూర్‌లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అస్సాం ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రెసిడెంట్‌ భూపేన్‌ కుమార్‌ బోరాతో పాటు జై రాం రమేష్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైరాం రమేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘మా షెడ్యూల్‌ ప్రకారం జనవరి 23 (మంగళవారం) జోడో న్యాయ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాము. అయితే మరోవైపు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా కార్యక్రమానికి అనుమతించకుండా ఉండటానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే మేము ముఖ్యమంత్రికి రెండు లేఖలు రాశాము. మంగళవారం జరగబోయే ఈ యాత్రకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని పోలీసులతోనూ, ముఖ్యమంత్రితోనూ చర్చించేందుకు మా ప్రతిపక్ష నాయకుడు దేబబ్రత సైకియా గౌహతి వెళ్లారు. జనవరి 23న రాహుల్‌గాంధీ గౌహతిలో నిరుద్యోగం, విద్యావవస్థ గురించి యువతతో సంభాషించనున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడనున్నారు’ అని జైరాం రమేశ్‌ అన్నారు.

➡️