195 మందితో బీజేపీ లోక్‌సభ అభ్యర్ధుల తొలి జాబితా

ఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే 195 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను బీజేపీ శనివారం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి వారణాసి నుంచి పోటీ చేయనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గాంధీ నగర్‌ నుంచి బరిలో నిలవనున్నారు. యూపీలోని లక్నో నుంచి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, అమేథి నుంచి మరోసారి స్మఅతి ఇరానీ బరిలో దిగనున్నారు.

గతంలో రాజ్యసభకు ఎన్నికైన ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ గుజరాత్‌లోని పోర్‌ బందర్‌ నుంచి పోటీ చేయనున్నారు. ఢిల్లీ నుంచి ప్రవీణ్‌ ఖండేల్వాల్‌, మనోజ్‌ తివారీ, సుష్మా స్వరాజ్‌ కుమార్తె బన్సూరి స్వరాజ్‌ బరిలో నిలవనున్నారు. జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్‌లోని గుణ స్ధానం నుంచి, రాజ్యసభ ఎంపీ భూపీందర్‌ యాదవ్‌ అళ్వార్‌ నుంచి లోక్‌సభ ఎన్నికల పోరులో దిగనున్నారు. మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను విదిశ నుంచి లోక్‌సభ బరిలో నిలిపారు.

ఇక తొలి జాబితాలో 34 మంది కేంద్ర మంత్రులకు అవకాశం లభించగా 28 మంది మహిళలకు చోటు దక్కింది. ఇద్దరు మాజీ సీఎంలకు అవకాశం కల్పించారు. 57 మంది ఓబీసీలకు తొలి జాబితాలో స్ధానం కల్పించారు. తొలి జాబితాలో యువతకు 47 స్ధానాలు, ఎస్సీలకు 27, ఎస్టీలకు 18 స్ధానాలను కేటాయించామని పార్టీ నేత వినోద్‌ తావ్డే తెలిపారు. కీలక యూపీ నుంచి 51 మంది అభ్యర్ధులను తొలి జాబితాలో ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌ నుంచి 20 మంది, ఢిల్లీ నుంచి బరిలో నిలిచే 5గురి పేర్లను తొలి జాబితాలో వెల్లడించారు. ఇక తెలంగాణ నుంచి 9 మంది ఎంపీ అభ్యర్ధులకు తొలి జాబితాలో చోటు దక్కింది.

➡️