ఎస్టీ జాబితాలోకి బోండో, ఖోండ్‌, పరంగి

Feb 7,2024 10:27 #Bondo, #Khond, #Parangi, #ST list
  • రాజ్యాంగ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
  • రాజ్యసభలో మూడు, లోక్‌సభలో నాలుగు బిల్లులకు ఓకే

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బోండో పోర్జా, ఖోండ్‌ పోర్జా, పరంగి పెర్జా తెగలను షెడ్యూల్డు తెగలు (ఎస్టీ) జాబితాలో చేర్చేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లును రాజ్యసభ మంగళవారం ఆమోదించింది. ఈ బిల్లుతో పాటు మొత్తం ఏడు బిల్లులు పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఆమోదం పొందాయి. వీటిలో మూడు రాజ్యసభలోనూ, నాలుగు లోక్‌సభలోనూ ఆమోదం పొందాయి. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాలో ఎస్సీ, ఎస్టీల జాబితాను సవరించడానికి ఉద్దేశించిన రెండు బిల్లులను రాజ్యసభ ఆమోదించింది. రాజ్యసభ రాజ్యాంగ (షెడ్యూల్డ్‌ తెగలు) ఆర్డర్‌ (సవరణ) బిల్లు, 2024, రాజ్యాంగ (షెడ్యూల్డ్‌ తరగతులు, షెడ్యూల్డ్‌ తెగలు) ఆర్డర్‌ (సవరణ) బిల్లు, 2024ని మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. మొదటి బిల్లులో ఆంధ్రప్రదేశ్‌లోని షెడ్యూల్డ్‌ తెగల జాబితాను సవరించాలని కోరగా, బోండో పోర్జా, ఖోండ్‌ పోర్జో, పరంగి పెర్జా తెగలను షెడ్యూలు తెగల జాబితాలో చేర్చారు. రెండో బిల్లు ఒడిశాలోని షెడ్యూల్డ్‌ తరగతులు, షెడ్యూల్డ్‌ తెగల జాబితాను సవరించాలని పేర్కొన్నది. అలాగే నీటి (కాలుష్య నివారణ, నియంత్రణ) సవరణ బిల్లు 2024ను కూడా రాజ్యసభ ఆమోదించింది.

జమ్మూకాశ్మీర్‌కు సంబంధించి మూడు బిల్లులు

జమ్మూకాశ్మీర్‌కు సంబంధించి ఒకే రోజు మూడు బిల్లులను లోక్‌సభ ఆమోదించింది. వీటిలో జమ్ముకాశ్మీర్‌ స్థానిక సంస్థల్లో ఇతర వెనుకబడిన తరగతులకు (ఒబిసి) రిజర్వేషన్‌ కల్పించే బిల్లు ప్రధానమైనది. దీనిపై జరిగిన చర్చకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రారు సమాధానమిచ్చారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఒబిసిలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఈ బిల్లును ఉద్దేశించారు. బిల్లుపై చర్చ సందర్బంగా ప్రతిపక్ష సభ్యులు జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు త్వరగా నిర్వహించాలని, నిర్ధిష్ట గడువుతో టైమ్‌లైన్‌ ప్రకటించాలని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఎంపి హస్నైన్‌ మసూది తదితరులు డిమాండ్‌ చేశారు. టిఎంసి ఎంపి సౌగతా రారు కూడా జమ్మూకాశ్మీర్‌లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల ఆవశ్యకతను, సుప్రీంకోర్టు ఉత్తర్వులను గుర్తు చేశారు. ఎన్‌సిపి ఎంపి సుప్రియా సూలే కూడా జమ్ముకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలను వెనువెంటనే నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్ర హోదాపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. జమ్మూ కాశ్మీర్‌ స్థానిక సంస్థల చట్టాల (సవరణ) బిల్లు అక్కడ ఇతర వెనుకబడిన తరగతులకు (ఒబిసి) న్యాయం చేస్తుందని బిజెపి ఎంపి జుగల్‌ కిషోర్‌ శర్మ అన్నారు. వైసిపి ఎంపి చింతా అనురాధ బిజెపి ప్రభుత్వానికి వత్తాసు పలికారు. ఇది ప్రగతిశీల చట్టమని, పంచాయతీలతో సహా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి ఈ బిల్లు దోహదపడుతుందని తెలిపారు. దీంతో పాటు జమ్ముకాశ్మీర్‌ షెడ్యూల్‌ క్యాస్ట్‌ ఆర్డర్‌ రాజ్యాంగ సవరణ బిల్లు – 2023, జమ్ముకాశ్మీర్‌ షెడ్యూల్‌ ట్రైబల్‌ ఆర్డర్‌ రాజ్యాంగ సవరణ బిల్లు – 2023లను లోక్‌సభ ఆమోదించింది.

పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పోటీ పరీక్షల్లో జరిగే అక్రమాలను అడ్డుకునేందుకు వీలుగా రూపొందించిన ‘పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్ఫెయిర్‌ మీన్స్‌) బిల్లు-2024’కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్థులు, అభ్యర్థుల ప్రయోజనాలను కాపాడేందుకు ఉద్దేశించిన బిల్లుగా దీన్ని పేర్కొన్నారు. ఈ బిల్లుకు సంబంధించి ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించిన కొన్ని సవరణలు తిరస్కరణకు గురయ్యాయి. అనంతరం లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించింది. ఇది అమల్లోకి వస్తే పేపరు లీకేజీకి పాల్పడినా, మాల్‌ ప్రాక్టీస్‌ చేసినా, నకిలీ వెబ్‌సైట్లను సృష్టించినా గరిష్ఠంగా 10 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.కోటి వరకూ జరిమానా విధించనున్నారు. యుపిఎస్సి, ఎస్‌ఎస్సి, ఆర్‌ఆర్బి, ఐబిపిఎస్‌, ఎన్డిఎ వంటి పోటీ పరీక్షలతోపాటు నీట్‌, జెఇఇ, సియుఇటి వంటి ప్రవేశ పరీక్షలకూ ఈ బిల్లు వర్తిస్తుంది.

కాంగ్రెస్‌ పాలనపై శ్వేతపత్రం !

కేంద్ర ప్రభుత్వం పదేళ్ల పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాల్సివుండగా..విస్మయకర రీతిలో గత కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో ఆర్థిక నిర్వహణపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు నిర్ణయించింది. ఇందుకోసం పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలను ఒక రోజు పొడిగించారు. శనివారం పదేళ్ల క్రితం కాంగ్రెస్‌ పాలనలో ఆర్థిక నిర్వహణ శ్వేత పత్రం విడుదల చేయనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో శ్వేత పత్రం విడుదల చేయనున్నారు. షెడ్యూల్‌ ప్రకారం జనవరి 31న ప్రారంభమైన 10 రోజుల బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 9తో ముగియనున్నాయి. అయితే, వచ్చే శనివారం వరకు సమావేశాలను పొడిగించనున్నారు.

పిఎం కిసాన్‌ మొత్తాన్ని పెంచే ప్రసక్తే లేదు ..

దేశవ్యాప్తంగా అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రధానమంత్రి కిసాన్‌ యోజన కింద అందించే మొత్తాన్ని పెంచాలని సర్వత్రా వస్తున్న డిమాండ్‌పై మోడీ సర్కార్‌ నీళ్లు కుమ్మరించింది. అలాంటి ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. పిఎం కిసాన్‌ మొత్తాన్ని పెంచే ఆలోచన ఏదీ తమకు లేదని బిజెపి ప్రభుత్వం పేర్కొంది. లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి అర్జున్‌ ముండా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పిఎం కిసాన్‌ మొత్తాన్ని ఏడాదికి రూ.12 వేలకు పెంచే ఉద్దేశమేదీ లేదని స్పష్టం చేశారు. మహిళా రైతులకు కూడా పెంచే ఆలోచన లేదన్నారు. 11 కోట్ల మంది రైతులకు 15 విడతలుగా మొత్తం రూ.2.81 లక్షల కోట్లు చెల్లించినట్లు చెప్పారు. పిఎం-కిసాన్‌ అందుకున్న రైతుల్లో ఏపి నుంచి 43 లక్షలు, తెలంగాణ నుంచి 30 లక్షల మంది ఉన్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద మూడు విడతలుగా రూ.2 వేలు చొప్పున రూ.6 వేలు మాత్రమే కేంద్రం అందిస్తోంది.

➡️