3 సీట్లలో అభ్యర్థుల మార్పు

Apr 16,2024 00:39 #2024 elections, #Congress, #Odisha
  •  ఒడిశాలో కాంగ్రెస్‌ తీరుపై హాకీ మాజీ కెప్టెన్‌ అసంతృప్తి

భువనేశ్వర్‌ : ఒడిశాలోని తలసరా అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారని తొలుత ప్రకటించిన అభ్యర్ధి ప్రబోధ్‌ టిర్కేను కాదని కాంగ్రెస్‌ పార్టీ ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు దేవేంద్ర భిట్రియా పేరును ప్రకటించింది. ఆదివారం ముగ్గురు అభ్యర్ధులను మార్చింది. ప్రముఖ క్రీడాకారుడు, 2007 ఆసియా కప్‌ ఛాంపియన్‌షిప్‌లో దేశాన్ని విజయ తీరాలకు చేర్చిన ఇండియన్‌ హాకీ మాజీ కెప్టెన్‌ టిర్కే (39)ను అభ్యర్ధిగా ఏప్రిల్‌ 2న ప్రకటించింది. ఈ సీటు గిరిజనులకు రిజర్వ్‌ చేయబడింది. ఎయిర్‌ ఇండియాలో ఉద్యోగాన్ని వదులుకుని టిర్కే సెప్టెంబరులో కాంగ్రెస్‌పార్టీలో చేరారు. ప్రచారం కూడా మొదలుపెట్టారు. కానీ పార్టీ చివరకు మొండిచెయ్యి చూపింది. పార్టీ తాజా నిర్ణయంపై టిర్కే తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారుల పట్ల వ్యవహరించే తీరు ఇది కాదని అన్నారు. తన పేరును ప్రకటించినప్పటి నుండి ప్రజలను కలుసుకుంటూ ప్రచారం చేస్తూ వచ్చానని, టిక్కెట్‌ ఇవ్వకూడదనుకున్నపుడు తన పేరును ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఆయన స్వగ్రామమైన నౌపడా హాకీకి నర్సరీగా పేరొందింది. రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ శరత్‌ పట్నాయక్‌ మాత్రం దీనిపై వచ్చిన ప్రశ్నలకు స్పందించలేదు. తలసరా కాంగ్రెస్‌కు పట్టున్న ప్రాంతం. 1974 నుండి 2019 వరకు 12సార్లు పోటీచేస్తే 9సార్లు కాంగ్రెస్‌నే గెలిచింది.

➡️