మహారాణి కోనార్‌ కన్నుమూత

Jan 7,2024 10:19 #cpm leader, #passed away
cpm leader maharani konar passed away
  • బర్ద్వాన్‌ మెడికల్‌ కాలేజీకి భౌతిక కాయం అందజేత

న్యూఢిల్లీ : ప్రముఖ కమ్యూనిస్టు నేత, అంగన్‌వాడీల సమాఖ్య వ్యవస్థాపక నేత మహారాణి కోనార్‌ శుక్రవారం పశ్చిమ బెంగాల్‌లోని బర్ద్వాన్‌లో కన్నుమూశారు. ఆమె వయసు 90సంవత్సరాలు. 1933 నవంబరు 23న జన్మించిన మహారాణి కోనార్‌ 1958లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. బర్ద్వాన్‌ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ, వామపక్ష ఉద్యమాన్ని నిర్మించడంలో చురుకైన పాత్ర పోషించారు. బెంగాల్‌లో ఐద్వా కీలక నేతల్లో ఆమె ఒకరు. కిసాన్‌ ఉద్యమ నేత బినరు కోనార్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. ప్రముఖ కమ్యూనిస్టు నేత హరే కృష్ణ కోనార్‌ ఆమె బావగారు. బర్ద్వాన్‌లోని సిపిఎం జిల్లా కార్యాలయంలో మహారాణి కోనార్‌ భౌతిక కాయాన్ని వుంచారు. రాణిదీగా పిలుచుకునే వేలాదిమంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు తమ ప్రియతమ నేతకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె భౌతిక కాయాన్ని బర్ద్వాన్‌ మెడికల్‌ కాలేజీ అధికారులకు అందజేశారు. 70వ దశకంలో పశ్చిమ బెంగాల్‌లో నెలకొన్న భయోత్పాత వాతావరణంలో సంఘటిత ప్రజా ప్రతిఘటనకు ఆమె ఒక ఆశాకిరణంగా నిలిచారు. తన ప్రాణాలకు ముప్పు వున్నప్పటికీ లెక్క చేయకుండా ఆమె పార్టీ నేతలకు, కార్యకర్తలకు తన ఇంట్లో ఆశ్రయం కల్పించారు. ఫ్యూడల్‌ భూస్వాములకు వ్యతిరేకంగా ఎఐకెఎస్‌ నేతృత్వంలో బర్ద్వాన్‌ జిల్లాలో ఆమె వీరోచిత రైతాంగ ఉద్యమంలో పాల్గొన్నారు. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లను సంఘటితపరచడంలో ఆమె క్రియాశీలంగా పాల్గొన్నారు. ఎఐఎఫ్‌ఎడబ్ల్యుహెచ్‌ వ్యవస్థాపక నేతల్లో ఆమె ఒకరు. పశ్చిమ బెంగాల్‌లో ఐసిడిఎస్‌ వర్కర్ల యూనియన్‌ ఉపాధ్యక్షురాలిగా ఆమె సుదీర్ఘకాలం పనిచేశారు. సిఐటియు పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా కూడా వున్నారు.

  • సిఐటియు సంతాపం

బెంగాల్‌లో వామపక్ష ఉద్యమానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన మహారాణి కోనార్‌ మృతికి సిఐటియు తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేసింది. ఆమె మృతికి సంతాప సూచకంగా పార్టీ పతాకాన్ని అవనతం చేసింది. ఆమె చనిపోయే రోజువరకు తన రాజకీయ జీవితంలో క్రియాశీలంగా వ్యవహరించారని సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ పేర్కొన్నారు. ఒక నెల రోజుల క్రితం ఆమె డివైఎఫ్‌ఐ పశ్చిమ బెంగాల్‌ నిర్వహించిన ఇన్సాఫ్‌ యాత్రలో పాల్గొన్నారు. కార్మికోద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే విషయంలో ఆమె నిరంతరంగా శ్రమించారని, ఆమె ప్రదర్శించిన నిబద్ధత, స్ఫూర్తి, అంకితభావం తరతరాల వరకు గుర్తుండిపోతాయని అన్నారు. ఆమె మృతితో కార్మికోద్యమ భావజాలం పట్ల గట్టి నిబద్ధత కలిగిన ఒక మంచి నేతను కోల్పోయామని పేర్కొన్నారు.

➡️