పరారీలో ఉన్న టిఎంసి నేత సహా సన్నిహితుల నివాసాల్లో ఇడి సోదాలు

Feb 23,2024 16:39 #ED raids, #TMC leader, #West Bengal

 కోల్‌కతా :    పిడిఎస్‌ స్కాం కేసులో పరారీలో ఉన్న తఅణమూల్‌ కాంగ్రెస్‌ నేత షేక్‌ షాజహాన్‌కి సంబంధించిన పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) శుక్రవారం సోదాలు జరిపింది. షాజహాన్‌తో పాటు అతని సన్నిహితులకు చెందిన సుమారు ఆరు ప్రాంతాల్లో సోదాలు జరిపినట్లు ఇడి అధికారులు తెలిపారు. సెంట్రల్‌ హౌరాలోని షేక్‌ షాజహాన్‌ సన్నిహితుడు పార్థ ప్రతిమ్‌ సేన్‌గుప్తా ఆవరణలోనూ సోదాలు జరిపినట్లు పేర్కొన్నారు.

పార్థ్‌ ప్రతిమ్‌ సేన్‌గుప్తా ఇటీవలే రెండు కొత్త నివాసాలను కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే వాటికి నగదు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు ఇడి పలు పత్రాలను పరిశీలిస్తోంది. దీంతో పాటు విజయ్ గఢ్‌లోని పుకూర్‌ నంబర్‌ 10 ప్రాంతంలోని మాజీ ప్రభుత్వ ఉద్యోగి నివాసంలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ మాజీ ఉద్యోగి అరూప్‌ సోమ్‌ చాలా కాలంగా చేపల వ్యాపారం చేస్తున్నారు.ఈ దాడులు షాజహాన్‌తో భూమి కబ్జాతో ముడిపడి ఉన్న కొత్త ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ఇసిఐఆర్‌)లో భాగంగా జరిగినట్లు ఇడి అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 29న విచారణలో పాల్గనాల్సిందిగా షాజహాన్‌కు ఇడి గురువారం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజు ఈ సోదాలు చోటు చేసుకోవడం గమనార్హం. ఇప్పటికే ఇడి నాలుగుసార్లు సమన్లు పంపింది.

పరారీలోనే టిఎంసి నేత

ఈ ఏడాది జనవరి 5 న, పిడిఎస్‌ స్కాం కేసులో విచారణకు వచ్చిన ఇడి అధికారులపై షాజహాన్‌ మద్దతుదారులు దాడికి దిగారు. ఈ ఘటనలో ముగ్గురు అధికారులకు గాయాలయ్యాయి. అప్పటి నుండి షాజహాన్‌ పరారీలో ఉన్నాడు.

➡️