‘ఇండియా’ అధికారంలోకి వస్తే.. సిఎఎ, క్రిమినల్‌ చట్టాలు రద్దు : చిదంబరం

న్యూఢిల్లీ : ఈసారి కేంద్రంలో ‘ఇండియా’ బ్లాక్‌ అధికారంలోకొస్తే…..పలు కీలక చట్టాలను రద్దు చేస్తామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర ఆర్థికమంత్రి పి. చిదంబరం హామీ ఇచ్చారు. రద్దు చేసే వాటిల్లో మొదటిస్థానంలో సిఎఎ (పౌరసత్వ సవరణ చట్టం) ఉందన్నారు. తొలి విడత పోలింగ్‌ సరళిని పరిశీలించిన అనంతరం ఆయన న్యూఢిల్లీలో తనను కలిసిన మీడియాతో ఆదివారం మాట్లాడారు. ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌, ట్రేడ్‌, అండర్‌ కామర్స్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఫెసిలిటేషన్‌ యాక్ట్‌ – 2020ని రద్దు చేస్తామనీ, అలాగే మరో మూడు కీలకమైన ‘భారత న్యాయ సంహిత’, ‘భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత’, ‘భారతీయ సాక్షా యాక్స్‌’ వంటి చట్టాలను కూడా రద్దు చేయనున్నామనీ చిదంబరం తెలిపారు. ఇక ఈ సందర్భంగా నేరం రుజువు కాకుండా ఎక్కువ కాలం జైళ్లలో ఉండే వారి కోసం ప్రత్యేకించి ‘బెయిల్‌ రూల్‌, జైల్‌ మినహాయింపు’ అనే సూత్రాన్ని అమలు చేసేందుకు ఒక ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ చట్ట ఆవశ్యకతను కేరళకు చెందిన జస్టిస్‌ కృష్ణ నొక్కి చెప్పారన్నారు. చాలా మంది నిందితులు బెయిల్‌ పొందడానికి సుప్రీంకోర్టు వరకు వెళ్లలేరని, ఇప్పటివరకూ 65 శాతం మంది ఖైదీలు విచారణ ప్రక్రియలోనే ఏళ్లతరబడి జైలులోనే ఉండిపోతున్నారని వివరిస్తూ….. వారంతా దోషులుగా నిర్ధారణ కానంతవరకు ఎందుకు జైలులో ఉండాలి? అని ఆయన ప్రశ్నించారు. ఈ ఖైదీల్లో 90 శాతం మంది ఓబిసి, ఎస్‌సి, ఎస్టీలున్నారని, వారి కోసం తాము ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామని ఆయన చెప్పారు. పోలీసులు, సిబిఐ తదితర దర్యాప్తు సంస్థలు 15 రోజుల విచారణ తర్వాత ప్రతి ఒక్కరూ తప్పకుండా బెయిల్‌ పొందేలా చేస్తామని చెప్పారు.

➡️