”మీ తల్లిదండ్రులు నాకు ఓటేయకపోతే రెండు రోజులు తినకండి” : పిల్లలతో ఎమ్మెల్యే బంగర్‌

మహారాష్ట్ర : ‘వచ్చే ఎన్నికల్లో మీ తల్లిదండ్రులు నాకు ఓటు వేయకపోతే, రెండు రోజులు భోజనం చేయకండి’ అని 10 ఏళ్లలోపు పిల్లలతో మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యే సంతోష్‌ బంగర్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంతోష్‌ బంగర్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ” ఎన్నికల ప్రచారంలో పిల్లల్ని వాడుకోకూడదు ” అని ఈసీ ఆదేశాలు జారీ చేసిన కొన్ని రోజులలోపే ఎమ్మెల్యే సంతోష్‌ బంగర్‌ పిల్లలతో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కలమ్‌నూరి ఎమ్మెల్యే అయిన సంతోష్‌ బంగర్‌ హింగోలి జిల్లాలోని జిల్లా పరిషత్‌ పాఠశాలను సందర్శించిన సమయంలో … అక్కడి పిల్లలతో మాట్లాడారు. ” వచ్చే ఎన్నికల్లో మీ తల్లిదండ్రులు నాకు ఓటు వేయకపోతే, రెండు రోజులు భోజనం చేయకండి ” అని కోరాడు. ” ఒకవేళ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రశ్నిస్తే.. సంతోష్‌ బంగార్‌కి ఓటేయండి, అప్పుడు మాత్రమే తింటాము” అని చెప్పాలని పిల్లలను ఎమ్మెల్యే కోరాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. 10 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలతో ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు దుమారాన్ని రేపాయి.

బంగార్‌ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని శరద్‌ పవార్‌ ఎన్‌సిపి కోరింది. ఎమ్మెల్యే సంతోష్‌ బంగర్‌ చేసిన వ్యాఖ్యలు ఈసీ ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నాయని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్‌సిపి కోరింది. బంగర్‌ పై ఎన్నికల కమిషన్‌ చర్య తీసుకోవాలని కాంగ్రెస్‌ నాయకుడు విజరు వాడెట్టివార్‌ డిమాండ్‌ చేశారు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యే పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నిద్రపోతున్నారా ? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోడి తిరిగి ప్రధానిగా రాకపోతే ఉరి వేసుకుంటానని గత నెలలో బంగర్‌ అన్నాడు. గతేడాది ఆగస్టు నెలలో ఒక ఉత్సవ ర్యాలీలో కత్తిని చూపించడంతో పోలీసులు బంగర్‌ పై కేసు నమోదు చేశారు. 2022లో మధ్యాహ్న భోజన కార్యక్రమం నిర్వహిస్తున్న క్యాటరింగ్‌ మేనేజర్‌ని చెంపదెబ్బ కొట్టిన వీడియో వైరలయ్యింది.

➡️