ఇండియా బ్లాక్‌ పార్లమెంటరీ నేతల భేటీ

Dec 7,2023 08:25 #Congress, #Kharge
india blank parliamentary leader meeting

కీలకమైన బిల్లులు, పార్లమెంట్‌ వ్యూహంపై చర్చ

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపైన, కీలక బిల్లులపైన ఇండియా బ్లాక్‌ పార్లమెంటరీ పార్టీ నాయకులు చర్చించారు. బుధవారం రాత్రి కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా బ్లాక్‌ పార్లమెంటరీ నాయకులు సమావేశం జరిగింది. మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, కెసి వేణుగోపాల్‌, అదిర్‌ రంజన్‌ చౌదరి, కె. సురేష్‌, (కాంగ్రెస్‌), లలన్‌ సింగ్‌ (జెడియు), రామ్‌ గోపాల్‌ యాదవ్‌ (ఎస్‌పి), టిఆర్‌ బాలు (డిఎంకె), వందనా చౌహాన్‌ (ఎన్‌సిపి), ఎలమరం కరీం (సిపిఎం), బినరు విశ్వం (సిపిఐ), రాఘవ్‌ చద్దా (ఆప్‌), మహువా మాంఝీ (జెఎంఎం), ఎన్‌ కె ప్రేమ్‌ చంద్రన్‌ (ఆర్‌ఎస్‌పి), ఈటీ మహ్మద్‌ బషీర్‌ (ఐయుఎంఎల్‌), జోషి కె. మణి (కేరళ కాంగ్రెస్‌)తో పాటు ఆర్‌జెడి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ఎండిఎంకె, విసికె తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు. టిఎంసి, శివసేన (ఠాక్రే) పార్టీలు సమావేశానికి హాజరు కాలేదు. అనంతరం సిపిఎం పార్లమెంటరీ పార్టీ నేత ఎలమరం కరీం మాట్లాడుతూ ”ప్రభుత్వం మూడు ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెడుతుంది. అది క్రిమినల్‌ చట్ట సవరణలు, భారతీయ శిక్షాస్మృతి, భారతీయ సాక్ష్యాధారాల చట్టం, ఇది చాలా ముఖ్యమైన చట్టం. కాబట్టి మేము ఏకరీతిగా నిలబడాలి. అది ఈ సమావేశంలో చర్చించాం” అని తెలిపారు. ఎన్‌.కె ప్రేమచంద్రన్‌ మాట్లాడుతూ ”రాజ్యసభ, లోక్‌సభ రెండింటిలోని ఫ్లోర్‌ లీడర్‌ల రెగ్యులర్‌గా జరిగే సాధారణ సమావేశం. మేము పార్లమెంట్‌ సమావేశానికి సంబంధించి ఫ్లోర్‌ కోఆర్డినేషన్‌ గురించి చర్చించాము. భాగస్వామ్య పక్షాల్లో ఎవరి మధ్యా అభిప్రాయ భేదాలు లేవు. ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయి” అని అన్నారు. కాంగ్రెస్‌ ఎంపి కె సురేష్‌ మాట్లాడుతూ ”మల్లికార్జున్‌ ఖర్గే సమక్షంలో ఫలవంతమైన సమావేశం జరిగింది. దాదాపు అన్ని ఇండియా గ్రూప్‌ భాగస్వాములు, ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. వివరంగా చర్చించాం…పార్లమెంట్‌లో ఐపిసి, సిఆర్పిసి, సిపిసి సవరణ బిల్లు వస్తోంది. ఎన్నికల కమిషన్‌ అపాయింట్‌మెంట్‌ సవరణ బిల్లు కూడా వస్తోంది. కాబట్టి, కొన్ని ముఖ్యమైన బిల్లులు రాబోతున్నాయి. మేము ఏ స్టాండ్‌ తీసుకోవాలో వివరంగా చర్చించాము” అని తెలిపారు. ఐయుఎంఎల్‌ ఎంపి ఈటి మహ్మద్‌ బషీర్‌ మాట్లాడుతూ ఇండియా గ్రూప్‌ అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించామని, ఇండియా గ్రూప్‌ను బలోపేతం చేయడం గురించి కూడా చర్చించామని అన్నారు. కాంగ్రెస్‌ ఎంపీ సయ్యద్‌ నసీర్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ ‘ త్వరలో ఇండియా గ్రూప్‌ నేతల సమావేశం ఉంటుందని, ఒకటి లేదా రెండు రోజుల్లో సమావేశం తేదీని ప్రకటిస్తామని అన్నారు.

➡️