INDIA bloc rally : రామ్‌లీలా మైదాన్‌కి చేరుకుంటున్నప్రతిపక్ష నేతలు

న్యూఢిల్లీ  :  ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అరెస్టును నిరసిస్తూ ఆదివారం ఇండియా ఫోరం ఇక్కడ రామ్‌లీలా మైదాన్‌లో భారీ ర్యాలీ చేపట్టనుంది. ఇండియా ఫోరంకి చెందిన పలువురు సీనియర్‌ నేతలు సిపిఎ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరీ సహా రాహుల్‌ గాంధీ, ఉద్ధవ్‌ థాకరే, శరద్‌ పవార్‌, అఖిలేష్‌ యాదవ్‌, డెరెక్‌ ఒ బ్రెయిన్‌, మెహబూబా ముఫ్తీ, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌లు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. కేజ్రీవాల్‌ భార్య సునీత కూడా సమావేశంలో భాగస్వామ్యం కానున్నారు. కేజ్రీవాల్‌ జైలు నుండి అందించిన సమాచారాన్ని ప్రజలకు అందించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

పంజాబ్‌, హర్యానా నుండి వేలాది మంది రామ్‌లీలా మైదానికి చేరుకుంటున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ వ్యాప్తంగా భద్రతా బలగాలను మోహరించింది.

ప్రస్తుతం దేశం క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటోందని, ఎటువంటి కారణం, విచారణ లేకుండా ప్రజలను జైలులో నిర్బంధిస్తున్నారని పిడిపి నేత మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. ఇది కాశ్మీర్‌లో జరగడం చూశామని, ఇప్పుడు ఈ ఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని అన్నారు. కుట్రలను అమలు చేయడానికి జమ్ముకాశ్మీర్‌ ఓ ప్రయోగ శాల అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ కుట్రలు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయని అన్నారు. కేజ్రీవాల్‌ బిజెపిలో చేరితే ఆయనపై ఉన్న ఆరోపణలన్నీ మాయమై ఉండేవని అన్నారు.

➡️