6న ఇండియా ఫోరం భేటీ

Dec 3,2023 20:51 #Congress, #INDIA bloc

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందించేందుకు ‘ఇండియా’ ఫోరం నేతలు ఈ నెల6న ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశం కానున్నారు. ఈ సమావేశం బుధవారం సాయంత్రం జరగనుంది. బిజెపిని ఐక్యంగా ఎదుర్కోవాలనే లక్ష్యంతో ఏర్పాటైన ఈ ఫోరమ్‌లో ఇప్పటివరకు 26 పార్టీలు భాగస్వాములయ్యాయి. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బిజెపిని ఐక్యంగా ఎదుర్కొనేందుకు ఫోరం నేతలు వివిధ ప్రణాళికలను చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముంబయి జరిగిన గత సమావేశానికి శివసేన (యుబిటి) అధినేత ఉద్ధవ్‌ థాకరే అధ్యక్షత వహించారు. నాటి సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీతోపాటు పలువురు ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఇప్పటివరకు పాట్నా, బెంగళూరు, ముంబయిలో మూడు సార్లు ఇండియా ఫోరమ్‌ సమావేశాలు జరిగాయి. అక్టోబరు మొదటి వారంలో భోపాల్‌లో ర్యాలీ నిర్వహించాలని భావించినప్పటికీ చివరి నిమిషంలో ఆ యోచనను విరమించుకున్నారు.

➡️