జాతీయ భద్రతకు ముప్పు -‘నిజ్జార్‌ కేసు’పై భారత రాయబారి ఆందోళన

May 8,2024 23:54 #'Nizzar case'

ఒట్టావా : భారత్‌, కెనడాల మధ్య ఇప్పటికే దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో, కెనడాలోని సిక్కు వేర్పాటువాద గ్రూపులు హద్దుమీరుతున్నాయని కెనడాలో భారత రాయబారి సంజయ్ కుమార్‌ వర్మ ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని జాతీయ భద్రతా అంశంగా, దేశ ప్రాదేశిక సమగ్రతకు సంబంధించిన విషయంగా భారత్‌ పరిగణిస్తుందని అన్నారు. గతేడాది ఖలిస్తాన్‌ వేర్పాటువాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జార్‌ హత్య కేసులో నిందితులంటూ ముగ్గురు భారతీయులను అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టిన నేపథ్యంలో మంగళవారం ఆయన వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఈ హత్య కేసును దేశీయ నేరంగా వర్మ భావిస్తున్నారు. భారతదేశ భవితవ్యాన్ని నిర్ణయించేది భారతీయులే కానీ విదేశీయులు కాదని వర్మ పేర్కొన్నారు. విదేశీ సంబంధాలపై మాంట్రియల్‌ కౌన్సిల్‌లో ఆయన మాట్లాడారు. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఎప్పుడైనా తాము చర్చలకు సిద్ధమన్నారు. కెనడా నుండి జాతీయ భద్రతకు సంబంధించి ముప్పు తలెత్తుతుండడం తనకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు.

➡️