పోలింగ్‌ శాతం, మత రాజకీయాలపై నేడు ఇసిని కలవనున్న ‘ఇండియా’ నేతలు

May 9,2024 00:14 #polling percentage

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో ప్రతీ దశ ముగిసిన తరువాత పూర్తి పోలింగ్‌ శాతాన్ని వేగంగా విడుదల చేయాలని డిమాండ్‌తో ఎన్నికల కమిషన్‌ను ఇండియా వేదిక నాయకులు గురువారం కలవనున్నారు. అలాగే, బిజెపి నాయకులు తన ఎన్నికల ప్రచారంలో ‘మతపరమైన ప్రసంగాలు’ చేయడంపై కూడా ఫిర్యాదు చేయనున్నారు. ఈ విషయాన్ని ఇండియా వేదికకు చెందిన పార్టీల నాయకులు బుధవారం తెలిపారు. గురువారం మధ్యాహ్నాం తరువాత ఎన్నికల కమిషన్‌ను కలవనున్న నాయకులు మెమోరాండం సమర్పిస్తారని, తమ డిమాండ్లపై అధికారులతో చర్చిస్తారని వెల్లడించారు.
కాగా, ఇప్పటికే జరిగిన రెండు దశల్లోనూ పోలింగ్‌ శాతం విడుదల్లో అసాధారణ జాప్యంపై ఎన్నికల కమిషన్‌కు సిపిఎం, కాంగ్రెస్‌, టిఎంసి పార్టీలు విడివిడిగా లేఖలు రాసాయి. అసాధారణ జాప్యంపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నెల 7న కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే వివిధ ప్రతిపక్ష పార్టీలకు రాసిన లేఖలో ‘ఇసి విడుదల చేసిన పోలింగ్‌ శాతం వివరాల్లో ‘వ్యత్యాసాలు’ ఉన్నాయి’ అని ఆరోపించారు. ఈ అంశంపై ‘సమిష్టిగా, ఐక్యంగా, ఖచిత్చంగా’ తమ స్వరాన్ని పెంచాలని ఇండియా వేదిక నాయకులను కోరారు.

➡️