ఆదివాసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారా ? .. ప్రధానిని నిలదీసిన కాంగ్రెస్

న్యూఢిల్లీ :   ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజన కమ్యూనిటీల హక్కులను పరిరక్షించడంలో మోడీ విఫలమయ్యారని కాంగ్రెస్‌ మండిపడింది.  సోమవారం బస్తర్‌లో ప్రధాని మోడీ ర్యాలీకి నిర్వహిస్తుండటంపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ విమర్శలు గుప్పించారు.   మోడీ ఆదివాసీల సంక్షేమానికి కట్టుబడి  ఉన్నారా అని ప్రశ్నించారు.

ప్రజల సంక్షేమాన్ని కార్పోరేట్‌ శక్తుల స్నేహానికి బలిచేశారని అన్నారు. దేశానికి ఊపిరితిత్తులుగా పరిగణించే దట్టమైన, అధిక జీవవైవిధ్యం కలిగిన హస్డియో అరణ్య అటవీ ప్రాంతానికి ప్రధాని మోడీ  ‘ప్రియమైన బంధువు ‘ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ నుండి ముప్పు పొంచి ఉందని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అటవీ ప్రాంత సంరక్షణ దృష్ట్యా ఈ అడవిలోని 40 బొగ్గు బ్లాక్‌లను కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ రద్దు చేసిందని అన్నారు. అయితే బిజెపి అధికారంలోకి వచ్చిన అనంతరం ఆ ఉత్తర్వులను రద్దు చేసిందని, ఆదీవాసీలు, సామాజిక కార్యకర్తలు ఆందోళనలను పక్కన పెట్టి ఆ బొగ్గు  బ్లాకులను అదానీకి చెందిన పార్సా కోల్‌ బ్లాక్‌కు  మైనింగ్‌ కోసం  అప్పగించిందని అన్నారు.

హస్డియో అరణ్య విధ్వంసం వల్ల ఆదివాసీల జీవనోపాధికి పూడ్చలేని నష్టం వాటిల్లుతోందని, అలాగే పర్యావరణం, వన్యప్రాణులకు తీవ్ర నష్టం కలుగుతోందని అన్నారు. ఇప్పటికే ఏనుగులు మనుష్యులపై దాడి చేస్తన్నాయని, ఈ ఘర్షణ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారని అన్నారు. దీంతో ఛత్తీస్‌గఢ్‌లోని ఆదివాసీల శ్రేయస్సును బిజెపి, మోడీ నిర్దయగా ప్రమాదంలో పడేశారో అర్థమౌతోందని అన్నారు.

మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం రూపొందించి, ప్రారంభించిన నాగర్నార్‌ స్టీల్‌ ప్లాంట్‌ను గతేడాది అక్టోబర్‌లో ప్రధాని మోడీ ఆర్భాటంగా ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ప్ర కటించారు. రూ.23,800 కోట్ల ప్లాంట్‌తో బస్తర్‌లో అభివృద్ధి వేగవంతమౌతుందని, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ప్రజలు అశించారని అన్నారు. వాస్తవానికి, 2020 నుండి బిజెపి ప్రభుత్వం ఈ ప్లాంట్‌ను ప్రైవేట్‌ పరం చేసేందుకు యత్నిస్తోందని, తమ సన్నిహితులకు 50.79 శాతం మెజారిటీ వాటాలను విక్రయించాలని నిర్ణయించుకుందని అన్నారు.

గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో హోం శాఖ మంత్రి అమిత్‌షా బస్తర్‌లో పర్యటించినపుడు ఈ ప్లాంట్‌ను ప్రైవేట్‌ పరం చేయబోమని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటివరకు ఆ హామీకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఈ స్టీల్‌ ప్లాంట్‌ను తన కార్పోరేట్‌ స్నేహితులకు విక్రయించలేదని బిజెపి ఎలాంటి ఆధారాలు చూపలేదని అన్నారు.

దేశంలోని గిరిజన సంఘాల దశాబ్దాల పోరాటానికి ముగింపునిస్తూ.. 2006లో కాంగ్రెస్‌ ప్రభుత్వం చారిత్రాత్మక అటవీ హక్కుల చట్టాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. దీంతో ఆదివాసీలకు అటవీ భూములపై హక్కులు పొందేందుకు మార్గం సుగమమైంది. అయితే గతేడాది ప్రధాని మోడీ అటవీ సంరక్షణ సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. అటవీ సంపదను కార్పోరేట్‌ స్నేహితులకు దోచిపెట్టేందుకే ఈ చట్టసవరణలని స్పష్టమైందని అన్నారు.

ప్రధాని మోడీ ఇప్పటికైనా ‘జల్‌ -జంగిల్‌-జమీన్‌ (నీరు-అడవులు-భూమి)’ నినాదాలు ఆపి, ఆదివాసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారా అని ప్రశ్నించారు. ఇకనైనా ప్రధాని మోడీ ఈ ప్రశ్నలపై మౌనం వీడాలని అన్నారు.

➡️