పీఠం కదిలిపోతోందా మోడీజీ !

-అందుకేనా మిత్రులు అదానీ, అంబానీలపై విమర్శలు
– ట్రక్కుల కొద్దీ డబ్బులు మీ స్వీయ అనుభవమే
– ప్రధాని వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఖర్గే, రాహుల్‌
న్యూఢిల్లీ : ప్రతిపక్షాల ఐక్య వేదిక ‘ఇండియా’ ఫోరానికి లభిస్తున్న ఆదరణతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీఠం ‘కదిలిపోతోంది’ అని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. అంతుకుమందు తెలంగాణలో జరిగిన ఒక ఎన్నికల ప్రచార సభలో మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని లక్ష్యంగా చేసుకొని నేరుగా మాటల దాడికి దిగారు. దేశంలోని పారిశ్రామిక వేత్తలకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడులను నిలువరించేందుకు అదానీలు, అంబానీలు కుమ్మరించిన నల్ల ధనాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఖర్చు చేస్తోందని మోడీ ఆరోపించారు. ‘ఐదేళ్లుగా యువనేత రాహుల్‌ అంబానీ, అదానీలపై విమర్శలు చేస్తూ నిత్యం వారి పేర్లనే స్మరించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ రాగానే అంబానీ, అదానీలపై విమర్శలు ఆపేశారు. నోరు మెదపడం లేదు. ఇందుకోసం వారి నుంచి ఎన్ని డబ్బుల సంచులు అందాయి?. అంటే మీరు ట్రక్కుల కొద్దీ దోపిడి సొమ్మును పొందారు’ అని మోడీ ఆరోపణలు గుప్పించారు.
మోడీ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ అంతే ధీటుగా తిప్పికొట్టింది. ‘పారిశ్రామిక మిత్రుల’ గురించే మోడీ విమర్శలు గుప్పిస్తున్నారంటే ఆయన కింద పీఠం కదిలిపోతోందని ఇట్టే అర్థమవుతోంది’ అని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు ఖర్గే పేర్కొన్నారు. ‘కాలం మారుతోంది. స్నేహితులు (అదానీ, అంబానీ – మోడీ) ఎల్లకాలం స్నేహితులుగా కొనసాగరు. మూడు దశల ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రధాని మోడీ తన సొంత స్నేహితులపైనే దాడికి దిగుతున్నారు. ఇదే ఈ ఎన్నికల వాస్తవిక ధోరణకి అద్దం పడుతోంది. ఆయన కుర్చీ కదిలిపోతోంది’ అని ఖర్గే తెలిపారు.
సిబిఐ, ఇడితో దర్యాప్తు చేయించండి : రాహుల్‌
కార్పొరేట్‌ అధిపతులు అదానీ, అంబానీల నుంచి కాంగ్రెస్‌కు డబ్బులు అందాయని ప్రధాని మోడీ విమర్శలు గుప్పించడంపై రాహుల్‌ కూడా తీవ్రస్థాయిలో స్పందించారు. ‘దమ్ముంటే ఈ వ్యవహారంపై సిబిఐ లేదా ఇడి’తో దర్యాప్తు చేయించండి’ అని మోడీకి సవాలు విసిరారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. వ్యాపారవేత్తలు ట్రక్కులు ద్వారా డబ్బులు పంపిచారనేది మోడీ తన సొంత అనుభవం ద్వారా చెప్పినట్టు ఉన్నారని రాహుల్‌ ఎద్దేవా చేశారు. ‘ఇద్దరు కార్పొరేట్‌ అధిపతులు (అదానీ, అంబానీ)కు మోడీ ఎంత డబ్బులు పంచారో, కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే దేశ పేదలకు వివిధ పథకాల ద్వారా పంపిణీ చేస్తాం’ అని రాహుల్‌ తెలిపారు. బిజెపి అవినీతి బండికి డ్రైవర్‌ ఎవరో, సహాయకుడు ఎవరో దేశ ప్రజలందరికీ తెలుసునని ఆయన పేర్కొన్నారు. ‘మోడీజీ కాస్త భయం వేస్తోందా? సాధారణంగా అదానీ, అంబానీల గురించి రహస్యంగా మాట్లాడేమీరు మొదటి సారి బహిరంగంగా మాట్లాడుతున్నారేంటి?’ అని ఆయన అన్నారు. ‘వాళ్లు (అదానీ, అంబానీ) ట్రక్కులు డబ్బులు పంపుతారన్న సంగతి మీకు మాత్రమే తెలుసు. అది మీ స్వీయ అనుభవం. పోనీ ఒక పని చేయండి. సిబిఐని, లేదా ఇడిని పంపించి దర్యాప్తు చేయించండి. అంతేకాని భయపడవద్దు’ అని మోడీకి రాహుల్‌ ధీటైన బదులిచ్చారు.

➡️