కేంద్ర మంత్రికి నిరసన సెగ 

Feb 18,2024 09:35 #fishermen, #Karnataka, #Protest
Karnataka fishermen protested Union Minister
  • పదేళ్లుగా మీకు ఓటేశాం.. మాకేం చేశారు?
  • నిలదీసిన కర్ణాటక మత్స్యకారులు

బెంగళూరు : కేంద్ర మంత్రి, కర్ణాటక బిజెపి ఎంపీ శోభా కరంద్లాజే స్థానిక మత్స్యకారుల నుంచి నిరసన సెగ ఎదుర్కొన్నారు. తమ కోసం ఏం చేశారంటూ ఆమెను నిలదీశారు. గురువారం ఉడిపిలో జాతీయ రహదారుల శాఖ అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శోభాతో మత్స్యకారుల సంఘం నాయకుడు కిషోర్‌ సువర్ణ, మరికొందరు మాట్లాడారు. మాల్పే నుంచి ఉడిపి వరకు హైవే నిర్మాణంలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పదేళ్లుగా మీకు ఓటేస్తూనే ఉన్నాం.. మాకేం చేశారు. ఈ ప్రాంత ప్రజలను పిలిచి మీటింగ్‌ పెట్టారా? ఆ పనీ ఎందుకు చేయలేదు. మీరు మా ప్రజాప్రతినిధి కాదా? మీకు బాధ్యత లేదా? ఆ రహదారికి సంబంధించి ఎందుకు చర్యలు తీసుకోలేదు?’ అని ఆమెను ప్రశ్నించారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో ఫోన్‌లో మాట్లాడానని శోభా అన్నారు. దీనిపైనా మత్స్యకార నేతలు ఆమెను నిలదీశారు. ‘కేంద్ర మంత్రి గడ్కరీ అబద్ధాలు చెబుతున్నారని రాత పూర్వకంగా ఇవ్వండి. మేం మిమ్మల్ని మళ్లీ అడగం’ అని మరొకరు అన్నారు. గోతులమయంగా మారిన మూడున్నర కిలోమీటర్ల రహదారిపై అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

➡️