సుప్రీంను ఆశ్రయించిన కేజ్రీవాల్‌

  •  అత్యవసర విచారణకు సిజెఐ అంగీకారం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : తనను ఇడి అరెస్టు చేయడాన్ని సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన రూలింగ్‌ను ఢిల్లీముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బుధవారం సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. దీనిపై అత్యవసర విచారణ జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనికి అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఇడి తనను అరెస్ట్‌ చేయడం అక్రమమంటూ కేజ్రీవాల్‌ ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, తగిన ఆధారాలతోనే ఇడి అరెస్టు చేసిందని జస్టిస్‌ స్వర్ణ కాంత్‌ శర్మ నేతృత్వంలోని ఏక సభ్య ధర్మాసనం మంగళవారం తీర్పు చెప్పింది. అంతేకాదు, ఇందులో ఏవిధమైన చట్ట ఉల్లంఘన కానీ, సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను ఉల్లంఘించడం గానీ జరగ లేదని జస్టిస్‌ శర్మ వ్యాఖ్యానించారు. దీనిని సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ తరపున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. తమ పిటిషన్‌ను అత్యవసర విచారణకు స్వీకరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ను ఆయన కోరారు.’ ఇ-మెయిల్‌ పంపండి. చూస్తాను’ అని సిజెఐ చంద్రచూడ్‌ పిటిషనర్‌ తరపు న్యాయవాదికి చెప్పారు. బలవంతపు చర్యల నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు తిరస్కరించడంతో మార్చి21న కేజ్రీవాల్‌ను ఇడి అరెస్టు చేసింది. ఏప్రిల్‌ 14 వరకు ఆయనను ప్రత్యేక న్యాయస్థానం జ్యుడిషియల్‌ కస్టడీకి పంపింది.
జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న సమయంలో తన లాయర్లను కలిసేందుకు అదనపు సమయం ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్‌ విజ్ఞప్తిని ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు బుధవారం కొట్టివేసింది. ప్రస్తుతం తీహార్‌ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌కు వారానికి రెండుసార్లు మాత్రమే తన లాయర్లను కలవడానికి అనుమతి ఉంది. అయితే.. వారానికి ఐదు సార్లు కలిసేలా అనుమతి ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. ఆ విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించడంతో ఇంతకుముందులా వారానికి రెండుసార్లు మాత్రమే లాయర్లను కలవడానికి వీలుంటుంది.

➡️