జర్నలిస్టుకు భద్రత కరువు

Feb 17,2024 08:19 #Attacks, #Indian journalists
Lack of security for journalists global media watch dog
  • గతేడాది 99 మంది మృత్యువాత 
  • 77 మంది గాజాపై ఇజ్రాయెల్‌ నరమేధంలోనే… 
  • గ్లోబల్‌ మీడియా వాచ్‌డాగ్‌ వార్షిక నివేదిక

న్యూఢిల్లీ : ప్రపంచలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా కచ్చితమైన, వాస్తవ సమాచారాన్ని అందించే కలం యోధులకు రక్షణ కరువైంది. అలాంటి జర్నలిస్టుల ప్రాణాలు గాలిలో దీపంలా మారుతున్నాయి. జర్నలిస్టుల మరణాలే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. గతేడాది 99 మంది జర్నలిస్టులు చనిపోయారు. వీరిలో 77 మంది గాజాపై ఇజ్రాయిల్‌ యుద్ధాన్ని రిపోర్ట్‌ చేస్తున్న సమయంలోనే ప్రాణాలు కోల్పోయారు. గ్లోబల్‌ మీడియా వాచ్‌డాగ్‌ ‘కమిటీ టు ప్రొటెక్ట్‌ జర్నలిస్ట్స్‌ (సిపిజె) ఈ సమాచారాన్ని తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ఈ సమాచారం ప్రకారం.. దశాబ్ద కాలంలో 2023 అనేది జర్నలిస్టులకు ఘోరమైన సంవత్సరం. ఈ ఏడాదిలో 99 మంది జర్నలిస్టులు చనిపోయారు. ఇందులో 77 మంది గాజాపై ఇజ్రాయెల్‌ నరమేధాన్ని రిపోర్టింగ్‌ చేస్తున్న సమయంలోనే ప్రాణాలు కోల్పోవటం గమనార్హం. ఇజ్రాయెల్‌ – గాజా యుద్ధం మొదటి మూడు నెలల్లోనే అనేక మంది జర్నలిస్టులు చనిపోయారు. ఇది ఒక దేశంలో ఒక ఏడాదిలో నమోదయ్యే సంఖ్య కంటే అధికం కావటం గమనార్హం. ఈ 77 మందిలో 72 మంది వారు పాలస్తీనాకు చెందిన వారు కాగా, ముగ్గురు లెబనాన్‌కు చెందినవారు, ఇద్దరు మాత్రమే ఇజ్రాయెల్‌ దేశానికి చెందినవారు. గురువారం నాటికి ఇజ్రాయెల్‌-గాజా యుద్ధంలో మరణించిన జర్నలిస్టుల సంఖ్య 88కు పెరిగిందని సిపిఎ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ మరణాలపై దర్యాప్తు పూర్తయిన తర్వాత మాత్రమే డేటా బేస్‌లోకి వాటిని చేర్చుతామని సంస్థ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్‌ దళాలు జర్నలిస్టులపై చేస్తున్న దాడులను న్యూయార్క్‌ కేంద్రంగా పని చేసే ఈ సంస్థ ఇప్పటికే ఖండించింది. ఇజ్రాయెల్‌ సైన్యం డజన్ల కొద్ది జర్నలిస్టులను ఉద్దేశపూర్వకంగానే చంపిందా అన్న అంశంపై సంస్థ దర్యాప్తును జరుపుతున్నట్టు సమాచారం. ఒకవేళ అదే నిజమైతే అది ‘యుద్ధ నేరం’గా పరిగణించబడుతుంది.

➡️