కాల్పుల విరమణ చర్చల్లో స్వల్ప పురోగతి ?

Apr 9,2024 00:17 #israel hamas war, #issrel
  •  దక్షిణ గాజా నుండి వైదొలగుతున్న ఇజ్రాయిల్‌ బలగాలు

గాజా : దక్షిణ గాజా నుండి తమ బలగాలన్నీ వైదొలగుతున్నాయని ఇజ్రాయిల్‌ ప్రకటించిన నేపథ్యంలో కైరోలో జరుగుతున్న కాల్పుల విరమణ తాజా విడత చర్చల్లో స్వల్ప పురోగతి వున్నట్లు ఈజిప్ట్‌ అధికారులు తెలిపారు. గాజాలో కాల్పుల విరమణకు, బందీల విడుదలకు సంబంధించి పురోగతి చోటు చేసుకుందని, ఒప్పందంలోని మౌలిక అంశాలపై సంబంధిత పక్షాలు అంగీకారానికి వచ్చాయని చెప్పారు. ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఈజిప్ట్‌ టివి సోమవారం ఈ విషయాలు తెలిపింది. ఈ చర్చల్లో హమాస్‌, ఇజ్రాయిల్‌ ప్రతినిధి బృందాలతో పాటూ సిఐఎ చీఫ్‌ బిల్‌ బర్న్స్‌, కతార్‌ విదేశాంగ మంత్రి షేక్‌ మహ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ రహమాన్‌ పాల్గొన్నారు. చర్చల అనంతరం హమాస్‌, కతార్‌ అధికారులు కైరో నుండి వెళ్లిపోయారు. రెండు రోజుల్లో తిరిగి వస్తామని చెప్పారు. గతేడాది అక్టోబరు 7 దాడి తర్వాత హమాస్‌ 253మందిని బందీలుగా పట్టుకుంది. వారిలో 129మంది బందీలుగా వున్నారు. మిగిలిన వారు జీవించి లేరు. ఆరు మాసాలుగా జరుగుతున్న ఈ యుద్ధంలో 33 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. 75వేల మందికి పైగా గాయపడ్డారు. జనవరి వరకు గాజాలో నాలుగైదు బెటాలియన్లతో అంటే దాదాపు 50 వేల మంది సైనికులతో ఇజ్రాయిల్‌ యుద్ధం చేస్తూ వచ్చింది. ప్రస్తుతం గాజాలో ఒక బెటాలియన్‌ను వుంచి మిగిలిన వారిని ఉపసంహరిస్తున్నామని ఐడిఎఫ్‌ తెలిపింది. ఆ ఒక్క బెటాలియన్‌ భద్రతా జోన్‌కు కాపలాగా వుంటారు. అంటే ప్రస్తుతం దక్షిణాదిన రాఫాలో మకాం వేసిన నిర్వాసితులైన పాలస్తీనియన్లు ఇజ్రాయిల్‌ అనుమతి లేకుండా తిరిగి ఉత్తర గాజాకు వెళ్లడానికి వీలు వుండదు. ఖాన్‌ యూనిస్‌ నగరం నుండి తమ బలగాలు వైదొలగాలని ఇజ్రాయిల్‌ రక్షణ మంత్రి యోవ్‌ గాలంట్‌ సోమవారం తెలిపారు. ఇక ఆ నగరంలో హమాస్‌ ఒక పనిచేయగల సంస్థగా ఎంత మాత్రమూ లేదని చెప్పారు. తమ లక్ష్యాలను సాధించామని చెప్పుకున్నారు. తదుపరి ఆపరేషన్‌ కోసం బలగాలు సన్నద్ధమవడానికి వీలుగానే ఈ ఉపసంహరణ అని గాలంట్‌ చెప్పారు. గాజాలో యుద్ధం కొనసాగుతుంది, యుద్ధం ఆపడానికి ఇంకా చాలా సమయం వుందని ఐడిఎఫ్‌ చీఫ్‌ ప్రకటించారు. ఆ నగరం నుండి పారిపోయి వచ్చేసిన ప్రజలు తిరిగి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నా అక్కడ శిధిలాల గుట్టలు తప్ప మరేమీ మిగల్లేదని వాపోతున్నారు.

➡️