Maharashtra : ‘మహా’లో కుదిరిన సీట్ల సర్దుబాటు

  • శివసేన 21, కాంగ్రెస్‌ 17, ఎన్‌సిపి 10 స్థానాల్లో పోటీ
  •  బిజెపిని ఓడించడమే లక్ష్యం : ఠాక్రే, పటోలే

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మహారాష్ట్రలో ఇండియా వేదికలో ప్రధాన భాగస్వామ్యపార్టీలుగా ఉన్న శివసేన, కాంగ్రెస్‌, ఎన్‌సిపి మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. మొత్తం 48 లోక్‌సభ స్థానాలకు గాను మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రేకు చెందిన శివసేన పార్టీ – 21,కాంగ్రెస్‌- 17, శరద్‌ పవర్‌ సారథ్యంలోని నేషలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) 10 సీట్లలో పోటీ చేసేందుకు ఈ మూడు పార్టీల మధ్య అంగీకారం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం సాంగ్లీలో శివసేన (ఠాక్రే) పోటీ తిరిగి పోటీ చేస్తుంది. భివాండిలో ఎన్‌సిపి నిలబడుతుంది. ముంబాయి ఉత్తర లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌కు కేటాయించారు.
ఈ సందర్భంగా శివసేన నేత ఉద్దవ్‌ ఠాక్రే మాట్లాడుతూ, బిజెపిని ఓడించడమే ఇండియా బ్లాక్‌ లక్ష్యమని అన్నారు. మోడీ తమ పార్టీని ‘నకిలీ శివసేన’గా పేర్కొన్నారని, దోపిడీ దొంగల పార్టీ నాయకుడు తమను ఫేక్‌ అనడం నవ్వుతెప్పిస్తోందన్నారు. బిజెపి ‘దోపిడీదారుల పార్టీ’ అని ఎలక్టోరల్‌ బాండ్ల ‘స్కామ్‌’తో మరింత స్పష్టమైందని ఠాక్రే అన్నారు. . బిజెపిని ఓడించాలనే లక్ష్యాన్ని సాధించడానికి ‘విశాల దృక్పథంతో’ ఉండాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్‌ నేత నానా పటోలే తెలిపారు. ఠాక్రే, శరద్‌ పవార్‌ పార్టీలను తిరుగుబాటుదారులు హైజాక్‌ చేశారని అన్నారు.
సీట్ల సర్దుబాటు ఒప్పందంలో భాగంగా జల్గావ్‌, పర్భానీ, నాసిక్‌, పాల్ఘడ్‌, కళ్యాణ్‌, థానే, రారుగఢ్‌, మావల్‌, ఉస్మానాబాద్‌, రత్నగిరి-సింధు దుర్గ్‌, బుల్దానా, హత్కనంగ్‌కలే, ఔరంగాబాద్‌, షిర్డీ, సాంగ్లీ, హింగోలి, యావత్మాల్‌-వాషిమ్‌, ముంబై సౌత్‌, ముంబై సౌత్‌ సెంట్రల్‌, ముంబై నార్త్‌ వెస్ట్‌, ముంబై నార్త్‌ ఈస్ట్‌ సీట్లను శివసేన (ఠాక్రే)కు కేటాయించారు. కాంగ్రెస్‌ నందుర్‌బార్‌, ధులే, అకోలా, అమరావతి, నాగ్‌పూర్‌, భండారా-గోండియా, గడ్చిరోలి-చిమూర్‌, చంద్రాపూర్‌, నాందేడ్‌, జాల్నా, ముంబై నార్త్‌ సెంట్రల్‌, ముంబై నార్త్‌, పూణే, లాతూర్‌, షోలాపూర్‌, కొల్హాపూర్‌, రామ్‌టెక్‌ స్థానాల్లో పోటీ చేస్తుంది.. బారామతి, షిరూర్‌, సతారా, భివాండి, దిండోరి, మాధా, రావర్‌, వర్ధన్‌, అహ్మద్‌నగర్‌ సౌత్‌, బీడ్‌ స్థానాల్లో ఎన్‌సిపి(శరద్‌ పవర్‌) పోటీ చేయనుంది. మహారాష్ట్రలో 48 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు ఈ నెల 19 నుంచి మే 20 మధ్య అయిదు దశల్లో జరగనున్నాయి.

➡️