కాంగ్రెస్‌పై మోడీ అవాకులు, చెవాకులు

Apr 22,2024 08:10 #2024 election, #Congress, #modi

జైపూర్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్‌లో ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవాకులు, చెవాకులు పేలారు. దేశంలో వ్యక్తిగత సంపదనంతా ముస్లింలకు పంపిణీ చేయాలని కాంగ్రెస్‌ యత్నిస్తుందని మోడీ ఆరోపించారు. దేశంలోని వనరులపై ముస్లింలకే తొలి హక్కు అని కాంగ్రెస్‌ ఇప్పటికే ప్రకటించిందని అన్నారు. రాజస్థాన్‌లోని జలోర్‌, బనస్వరా నియోజకవర్గాల్లో బిజెపి అభ్యర్థుల తరుపున మోడీ ప్రచారం నిర్వహించారు. దేశాన్ని కాంగ్రెస్‌ ఎప్పటికీ బలోపేతం చేయదని ప్రధాని మోడీ ఆరోపించారు. ‘ఇప్పటికే జరిగిన మొదటి దశ పోలింగ్‌లో రాజస్థాన్‌లోని సగం మంది ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారు. కాంగ్రెస్‌ ఎప్పటికీ దేశాన్ని శక్తిమంతం చేయదని ఇక్కడి ప్రజలకు తెలుసు. 2014కు ముందున్న పరిస్థితులు మళ్లీ రావాలని ప్రజలు కోరుకోవట్లేదు” అని మోడీ అన్నారు. బంధుప్రీతి, అవినీతితో చెదలు పట్టిన కాంగ్రెస్‌ దేశాన్ని అభివృద్ధి చెందకుండా చేసిందని దుయ్యబట్టారు. గతంలో చేసిన పాపాలకు కాంగ్రెస్‌ ప్రస్తుతం శిక్ష అనుభవిస్తోందన్నారు. ఒకప్పుడు 400 సీట్లు గెలిచిన ఆ పార్టీ ప్రస్తుతం 300 సీట్లలో కూడా సొంతంగా పోటీ చేయలేకపోయిందని వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రతి ఇంటికి, ప్రతి రైతుకు నీరు అందేలా చేయటం తన లక్ష్యమని మోడీ పేర్కొన్నారు. అయితే దురదృష్టం కొద్దీ రాజస్థాన్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందులో కూడా అవినీతి చేసిందని, ఈ తప్పును మరోసారి జరగనీయకుండా కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలని ప్రధాని ప్రజలను కోరారు. రాజస్థాన్‌లో 25 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో 12 స్థానాలకు ఈ నెల 19న పోలింగ్‌ నిర్వహించగా, మిగిలిన 13 స్థానాలకు ఈనెల 26న రెండో విడత పోలింగ్‌ జరగనుంది.

➡️