MPs: సంపన్న ఎంపీలు

Jun 22,2024 00:39 #MPS, #MPs assets

 సగటు పట్టణ గృహాల కంటే 27 రెట్లు ధనవంతులు
75 శాతం కంటే ఎక్కువ మంది ఎంపీల ఆస్తులు రూ. 3 కోట్ల పైనే
న్యూఢిల్లీ : దేశంలో ఇటీవల ముగిసిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో పలు పార్టీల నుంచి గెలుపొందిన ఎంపీలు, పోటీలో ఉన్న అభ్యర్థులూ ధనవంతులే ఉన్నారు. వివిధ పార్టీల నుంచి విజయంసాధించిన ఎంపీలు.. సగటు పట్టణ గృహాల కంటే 27 రెట్లు సంపన్నులుగా ఉన్నారు. దేశంలోని అగ్రశ్రేణి 10 శాతం పట్టణ కుటుంబాలకు సమానమైన ఆస్తులతో పలు పార్టీలలో ధనవంతులు ఉన్నారు. అలాగే, 75 శాతం కంటే ఎక్కువ మంది ఎంపీల సగటు ఆస్తులు రూ. 3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువే కావటం గమనార్హం.
అభ్యర్థుల ఎన్నికల అఫిడవిట్లలో సమర్పించిన సమాచారం ప్రకారం.. 2024 ఎన్నికలలో గెలిచిన అభ్యర్థుల మధ్యస్థ ఆస్తి విలువ రూ.7.4 కోట్లుగా ఉన్నది. దాదాపు 92 శాతం మంది విజేతలు రూ. 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారు. అయితే వారిలో 75 శాతం మంది రూ.3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారు. 2024లో రన్నరప్‌ అభ్యర్థుల మధ్యస్థ ఆస్తి విలువ రూ.6.25 కోట్లు. వీరిలో దాదాపు 88 శాతం మంది రూ. 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు. 68 శాతం మంది రూ.3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తులు కలిగి ఉండటం గమనార్హం. 2019లో అభ్యర్థుల ఆస్థి విలువలు ఈ విధంగా ఉన్నాయి. గెలిచిన అభ్యర్థి మధ్యస్థ ఆస్తి రూ.4.8 కోట్లుగా ఉన్నది. దాదాపు 95 శాతం మంది విజేతలు రూ. 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారు. వారిలో 88 శాతం మంది ఆస్తుల విలువ రూ. 3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.
2019 ఎన్నికలలో రన్నరప్‌గా నిలిచిన అభ్యర్థుల మధ్యస్థ ఆస్తి విలువ రూ.5.4 కోట్లు. వారిలో దాదాపు 85 శాతం మంది రూ. 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు. 63 శాతం మందికి రూ.3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తులు ఉన్నాయి. విజేతలు, రన్నరప్‌లుగా నిలిచిన అభ్యర్థులు రూ. 1 కోటి కంటే ఎక్కువ విలువైన ఆస్తులను కలిగి ఉండటానికి పార్టీలు ధనవంతులైన అభ్యర్థులను మాత్రమే నిలబెట్టటం కారణం. 2024లో టాప్‌ 27 పార్టీల అభ్యర్థుల మధ్యస్థ ఆస్తులు కనీసం రూ. 1 కోటిగా ఉన్నది. రెండు ప్రధాన జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌ విలువలు వరుసగా రూ.7.6 కోట్లు, రూ.5.4 కోట్లుగా ఉన్నది.
ఆలిండియా డెట్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సర్వే- 2019 అంచనా ప్రకారం.. పట్టణ కుటుంబాల్లోని ఆస్తుల సగటు విలువ రూ.27.1 లక్షలు. గ్రామీణ కుటుంబానికి సంబంధించిన గణాంకాలు రూ.15.9 లక్షలుగా ఉన్నాయి. దీనిని బట్టి చూస్తే.. 2024లో గెలిచిన అభ్యర్థి సగటు ఆస్తులు సగటు పట్టణ కుటుంబ ఆస్తి కంటే 27 రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇది రన్నరప్‌ అభ్యర్థి విషయంలో 23.1 రెట్లు ఎక్కువగా ఉన్నది. పట్టణ ప్రాంతాల్లోని సంపన్న 10 శాతం కుటుంబాల సగటు ఆస్తి రూ.1.5 కోట్లు. ఇక పార్టీల వారీగా చూస్తే.. బహుజన్‌ సమాజ్‌ పార్టీ (రూ. 47 లక్షలు), పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (రూ.87 లక్షలు), సిపిఎం (రూ.1 కోటి) అత్యల్ప సగటు ఆస్తులు కలిగిన అభ్యర్థులను నిలబెట్టాయి. వారిలో సిపిఎం నుంచి మాత్రమే గెలిచిన అభ్యర్థులు నలుగురు ఉన్నారు.

 

➡️