ఎంఎస్‌పి చట్టం చేయాల్సిందే : నేడు ‘ఢిల్లీ చలో’ పాదయాత్ర

Feb 21,2024 08:29 #'Shambhu', #Delhi, #Dharna, #formers
  • ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలి
  • చర్చలు విఫలమైన నేపథ్యంలో రైతన్నల పోరుబాట
  • ‘శంభూ’ వద్ద పోటెత్తిన కర్షకలోకం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వంతో పలు దఫాలుగా నిర్వహించిన చర్చలు విఫలమైన నేపథ్యంలో అన్నదాతలు తమ ఆందోళనలను మరింత ఉధృతం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రధానంగా మూడు రకాల పప్పు ధాన్యాలు, మొక్కజన్న, పత్తి పంటలను పాత ఎంఎస్‌పికి కొనుగోలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తక్షణమే అన్ని పంటలకు కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని, ఇందుకోసం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. చర్చల విఫలం నేపథ్యాన కేంద్రంపై మరింత నిరసనాగ్రహంతో రైతన్నలు తమ మలి విడత పోరాటాన్ని మునపటి కంటే ఉధృతంగా చేపట్టేందుకు కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇదే దిశగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగం తమ ఆందోళలను బుధవారం పున్ణప్రారంభించింది. ఢిల్లీ సరిహద్దు ప్రాంతమైన ‘శంభూ’కు మంగళవారం సాయంత్రం రైతులు వేలాదిగా తరలివచ్చారు. వందలాది ట్రాక్టర్లు, ట్రాలీలు చేరుకున్నాయి. పోలీసులు కూడా ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మోహరించారు. పంజాబ్‌, హర్యానా నుంచి పెద్ద సంఖ్యలో రైతులను, వ్యవసాయ కార్మికులను సమీకరించడంతో పాటు అణిచివేత చర్యలను కూడా ఎదుర్కొనేందుకు కర్షకలు మరింత సంసిద్ధమయ్యారు. భాష్పవాయు గోళాలను ప్రతిఘటించేందుకు ఇనుప కవచాలను ధరించిరావడం విశేషం. శంభు సరిహద్దులో పంజాబ్‌, హర్యానా రైతులు భారీగా చేరుకున్నారు. పోలీసు బారికేడ్లు, ఇనప చువ్వలను తొలగించేందుకు రైతులు భారీ యంత్రాలను కూడా సిద్ధం చేశారు. శాంతియుతంగా ఢిల్లీ వైపు పాదయాత్ర కొనసాగిస్తామని రైతులు చెబుతున్నారు. రైతుల పోరాటాన్ని అణిచివేసే చర్యలు మానుకోవాలని, శాంతియుత నిరసనలకు అనుమతించాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈ నెల 21న బుధవారం ఉదయం 11 గంటలకు ‘డిల్లీ చలో’ పాదయాత్ర కొనసాగుతుందని రైతు సంఘాల నేత సర్వన్‌ సింగ్‌ పందేర్‌ ప్రకటించారు. కాగా రైతుల ‘ఢిల్లీ చలో’ పిలుపు నేపథ్యంలో సామాజిక మాధ్యమాలపై కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. ఇప్పటికే 177 సోషల్‌ మీడియా ఖాతాలను, రైతుల ఆందోళనలతో అనుబంధంగా ఉన్న లింక్‌లను కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిషేధించింది.

స్వామినాథన్‌ ఫార్ములాలోనే ఎంఎస్‌పి ఇవ్వాలి 

                రైతు సంఘాలుకనీస మద్దతు ధర విషయంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని రైతు సంఘాల నాయకులు విమర్శించారు. దేశవ్యాప్తంగా రైతులు ప్రధానంగా పండించే 23 పంటలకు కనీస మద్దతు ధరను ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ ప్రతిపాదనకు అనుగుణంగా ప్రకటించాలని భారతీ కిసాన్‌ యూనియన్‌ (ఏక్తా సిద్ధూపూర్‌) చీఫ్‌ జగ్జిత్‌ సింగ్‌ దల్లేవాల్‌, పంజాబ్‌ కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్‌ సింగ్‌ పంధేర్‌ డిమాండ్‌ చేశారు. రైతులు లేవనెత్తిన డిమాండ్లన్నిటినీ నెరవేర్చాలని, ఒట్టి హామీలు, వాగ్దానాలను తాము విశ్వసించబోమని, కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కనీస మద్దతు ధర చట్టం తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా ఒకరోజు పార్లమెంట్‌ సమావేశాన్ని నిర్వహించాలని కోరారు. పార్లమెంట్‌లో కేంద్రం ఎంఎస్‌పి చట్టం తెస్తే దానికి ఓటు వేస్తామని ప్రతిపక్షాలన్నీ కూడా తమ వైఖరిని స్పష్టం చేయాలని ఆయన కోరారు.

➡️