విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న నితీష్‌

Feb 12,2024 11:52 #Bihar, #Nitish Kumar, #Trust Vote

పాట్నా : బీహార్‌ సిఎం నితీష్‌కుమార్‌ బిజెపి మద్దతుతో మరోసారి ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ప్రభుత్వం సోమవారం విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. ఆయన సిఎం అయిన 14 రోజుల తర్వాత ఈరోజు (ఫిబ్రవరి 12 సోమవారం) ఫ్లోర్‌ టెస్ట్‌ జరుగుతుంది. ఈరోజు అసెంబ్లీలో ఎన్డీయే (నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌) ప్రభుత్వానికి మెజారిటీ ఉందని నిరూపించుకోవాల్సి ఉంది. ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతుగా 122 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. నితీష్‌కుమార్‌ సిఎంగా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఆ సంఖ్య కంటే తక్కువగా ఉంటే ప్రభుత్వం పడిపోతుంది.

కాగా జనవరి 28వ తేదీన ఆర్‌జెడితో పొత్తుపెట్టుకున్న మహాకూటమిని వీడి బిజెపితో జతకట్టి నితీష్‌ సిఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ సమయంలో జెడియు (జనతాదళ్‌ యునైటెడ్‌)కి చెందిన 45 మంది ఎమ్మెల్యేలు మాత్రమే నితీష్‌ వెంట ఉన్నారు. ఆ తర్వాత బిజెపికి చెందిన 78 ఎమ్మెల్యేలకు జెడియుకి మద్దతిచ్చారు. వీరితోపాటు ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన హిందుస్తానీ అవామ్‌ మోర్చాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు, ఒక స్వతంత్ర అభ్యర్తి నితీష్‌ వెంట ఉన్నారు. మొత్తంగా 128 ఎమ్మెల్యేల మద్దతు నితీష్‌కి ఉంది. దీంతో ఆయన కొత్తమంత్రివర్గంతో సిఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

బీహార్‌ రాష్ట్రంలో ఆర్‌జెడి (రాష్ట్రీయ జనతాదళ్‌)కి 79 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ 19 మంది, వామపక్షాలకు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరితోపాటు అసదుద్దీన్‌ ఒవైసీ పార్టీకి చెందిన ఒకేఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఇలా ప్రతిపక్షంలో మొత్తంగా 114 మంది ఎమ్మెల్యేలున్నారు. ఫ్లోర్‌టెస్ట్‌కి సరిపడా ఎమ్మెల్యేలు లేకపోవడంతో రాజ్‌భవన్‌ వారి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేదు.

➡️