Rahul Gandhi: ఈ ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమికి 150 సీట్లు కూడా కష్టమే

భోపాల్‌ :    లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎకు 150 సీట్లు కూడా కష్టమేనని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌- బిజెపి మార్చాలనుకుంటున్న రాజ్యాంగాన్ని కాపాడటమే ఈ ఎన్నికల లక్ష్యమని అన్నారు. మధ్యప్రదేశ్‌లోని రత్లాం -ఝబువా లోక్‌సభ సీటు పరిధిలోని అలీరాజ్‌పూర జిల్లాలోని జోబాట్‌లో సోమవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్‌ ప్రసంగించారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్‌ ప్రభుత్వం రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగిస్తుందని అన్నారు. కులగణన చేపడతామని మరోసారి స్పష్టం చేశారు. ఇది ప్రజల స్థితిగతులను వెల్లడిస్తుందని, దేశంలో రాజకీయాల దిశను మారుస్తుందని అన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తామని బిజెపి నేతలు స్పష్టంగా చెప్పారని అన్నారు. మరోసారి 400 సీట్లు నినాదం ఇస్తున్నారని, 400 సీట్లు పక్కన పెడితే.. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమికి 150 సీట్లు కూడా రావని అన్నారు.

బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ మూకలు నాశనం చేయాలనుకున్న రాజ్యాంగాన్ని రక్షించడమే కాంగ్రెస్‌, ప్రతిపక్ష ఇండియా బ్లాక్‌ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ రాజ్యాంగం వలనే గిరిజనులు, దళితులు, ఒబిసిలు ప్రయోజనం పొందుతున్నారని, నీరు, భూమి, అడవులపై వారికి రాజ్యాంగం హక్కు కల్పించిందని అన్నారు. మోడీ ప్రభుత్వం ప్రజల హక్కులను కొల్లగొట్టాలని చూస్తోందని, తాము దానిని ఆపాలనుకుంటున్నామని అన్నారు. బిజెపి నేతలు దళితుల, గిరిజనుల, ఒబిసిల రిజర్వేషన్లను లాక్కుంటామని చెప్పారని అన్నారు. సుప్రీంకోర్టు రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేసిందని, తాము దానిని 50 శాతానికి పైగా పెంచుతామని హామీ ఇచ్చారు. గిరిజనులు, దళితులు, ఒబిసిలకు వారి అవసరాన్ని అనుసరించి రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఇండియా బ్లాక్‌ అధికారంలోకి వస్తే కుల గనణ చేపడుతుందని, ఆదివాసి, దళితులు, ఒబిసి వంటి సాధారణ కులాల నుండి పేదల అభ్యున్నతి కోసం ఆర్థిక గణనతో ముందుకు సాగుతుందని అన్నారు. ఇది ఇండియా బ్లాక్‌ చేపట్టనున్న విప్లవాత్మక మార్పు అని అన్నారు.

➡️