పినరయి విజయన్‌పై రాహుల్‌ వ్యాఖ్యలకు సర్వత్రా ఖండనలు

  • రాజకీయ అపరిపక్వతను సూచిస్తున్నాయని విమర్శలు

ప్రజాశక్తి ప్రతినిధి-తిరువనంతపురం : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ రెచ్చగొట్టే విధంగా, నిరాధారంగా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్‌ వ్యాఖ్యలపై పినరయి తీవ్రంగా స్పందించారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై, మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభు త్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు సల్పేందుకు ఎల్‌డిఎఫ్‌కు కాంగ్రెస్‌ సర్టిఫికెట్‌ అవసరం లేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ చేపట్టిన కార్యక్రమంలో గోవల్కర్‌ ఫోటో ఎదురుగా కొవ్వొత్తులు వెలిగించి, ఆర్‌ఎస్‌ఎస్‌ను అడుక్కోవడం ద్వారా ఓట్లు సంపాదించుకున్నవారు ఇలా ఉపదేశాలు బోధించకూడదని విజయన్‌ పేర్కొన్నారు. ”2019లో సిఎఎకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినపుడు, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రకాష్‌ కరత్‌, బృందాకరత్‌లు అరెస్టయ్యారు. ఆ అరెస్టయిన వారి జాబితాలో కాంగ్రెస్‌ నేతలు ఒక్కరైనా వున్నారా?” అని విజయన్‌ ప్రశ్నించారు. రాహుల్‌ వ్యాఖ్యలు దిగ్భ్రాంతి కలిగించేలా వున్నాయని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఇండియా అలయన్స్‌ సారాన్ని కాంగ్రెస్‌ గ్రహించాలని, అటువంటి వేదిక ఏర్పాటు చేయడం వెనుక గల ప్రయోజనాన్ని అర్ధం చేసుకోవాలని అన్నారు. బిజెపిని వ్యతిరేకిస్తున్నందుకు తమిళనాడు ముఖ్యమంత్రిని కూడా అరెస్టు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తుందా? కాంగ్రెస్‌ తీసుకున్న ఈ దురదృష్టకరమైన వైఖరిని కేరళ ప్రజలు తిరస్కరిస్తారని ఏచూరి పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు రాజకీయంగా అపరిపక్వంగా వున్నాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాష్‌ కరత్‌ విమర్శించారు. ఇంతకుముందు, కేజ్రివాల్‌ను ఎందుకు అరెస్టు చేయలేదని ఢిల్లీలో కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నించారని కరత్‌ గుర్తు చేశారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీలను నిందితులుగా పేర్కొన్నపుడు, లోక్‌సభ సభ్యత్వా నికి రాహుల్‌ను అనర్హుడిగా ప్రకటించినపుడు పినరయి తీవ్రంగా విమర్శిస్తూ ప్రకటన జారీ చేసిన విషయాన్ని కరత్‌ గుర్తు చేశారు. వివిధ బహిరంగ సభల్లో మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ, కేరళ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఇడి ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. బిజెపికి వ్యతిరేకంగా విజయన్‌ కూడా బలమైన వైఖరి తీసుకున్నట్లైతే ఆయన ఎందుకు ఇంకా న్యాయపరమైన పర్యవసానాలు ఎదుర్కొనడం లేదు. ఎందుకు జైలుకెళ్ళడం లేదు? అని రాహుల్‌ ప్రశ్నించారు.

➡️