రాజ్యసభ ఎన్నికలు నిర్భీతిగా, స్వేచ్ఛగా జరగాలి

Mar 5,2024 08:03 #Rajya Sabha, #Supreme Court
pile on supreme court

సుప్రీం వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : రాజ్యసభ లేదా కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్స్‌కి జరిగే ఎన్నికలకు అత్యంత రక్షణ కల్పించాల్సిన అవసరముందని సుప్రీం కోర్టు సోమవారం పేర్కొంది. ఎలాంటి భయాలు, వేధింపులు లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొంది. ”రాజ్యసభ లేదాకౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్స్‌ మన ప్రజాస్వామ్యం పనితీరులో అంతర్గత పాత్ర పోషిస్తాయి. రాజ్యసభ పోషించే పాత్ర రాజ్యాంగ మౌలిక స్వరూపంలోని భాగమే. అందువల్ల, 80వ అధికరణ కింద రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవడంలో రాష్ట్రాల శాసనసభల సభ్యులు పోషించే పాత్ర గణనీయమైనది, దానికి అత్యంత రక్షణ కల్పించాల్సిన అవసరముంది. స్వేచ్ఛగా, చట్టపరంగా వేధిస్తారనే ఎలాంటి భయాందోళనలు లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాల్సి వుంది.” అని ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం స్పష్టం చేసింది. రాజ్యసభ సభ్యులను ఎన్నుకునే క్రమంలో ఎన్నికైన అసెంబ్లీ సభ్యులు నిర్భీతిగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడమన్నది రాష్ట్ర అసెంబ్లీ హుందాగా, సమర్ధవంతంగా పనిచేయడానికి అవసరమని చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ పేర్కొన్నారు. సభా వేదికపై కేవలం చట్టాలు చేయడానికి మాత్రమే పార్లమెంటరీ హక్కును పరిమితం చేయరాదని, ఎన్నికైన సభ్యుల ఇతర అధికారాలు, బాధ్యతలకు కూడా వీటిని వర్తింప చేయాలని కోర్టు పేర్కొంది.

➡️