ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ సమావేశం వాయిదా 

Dec 5,2023 15:31 #Congress, #INDIA Alliance

 న్యూఢిల్లీ  :    ప్రతిపక్ష కూటమి  ఇండియా సమావేశం వాయిదా పడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.  బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌, సమాజ్‌ వాదిపార్టీ (ఎస్‌పి) అధ్యక్షుడు అఖిలేష్‌యాదవ్‌లు ఈ సమావేశాన్ని దాటవేయాలని యోచిస్తున్నారన్న ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే సమావేశం వాయిదాపడినట్లు వార్తలు రావడం గమనార్హం.  వారిరువురు ఈ సమావేశానికి తమ ప్రతినిధులను పంపనున్నట్లు తెలుస్తోంది.  బుధవారం జరిగే ఇండియా కూటమి సమావేశానికి వెళ్లే ఆలోచనలో అఖిలేష్‌ యాదవ్‌ లేరని ఆ పార్టీ ప్రతినిధి రాజేంద్ర చౌదరీ తెలిపారు. దీంతో రేపు ఢిల్లీలో జరగాల్సిన కూటమి సమావేశం వాయిదా పడినట్లు తెలుస్తోంది.

మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కూటమి తదుపరి కార్యాచరణపై చర్చిచేందుకు కాంగ్రెస్‌ పార్టీ సమావేశానికి పిలుపునిచ్చింది. డిసెంబర్‌ 6వ తేదీన ఢిల్లీలో సమావేశం జరగనున్నట్లు ప్రకటించింది. అయితే ఆ సమావేశం గురించి తనకు తెలియదని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. మిచౌంగ్‌ ఎఫెక్ట్‌తో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో తాను సమావేశానికి హాజరుకాలేనని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కూడా ప్రకటించారు.

సీట్ల ఒప్పందానికి కాంగ్రెస్‌ అంగీకరించినట్లైతే, మూడు రాష్ట్రాల్లోనూ విజయం సాధించి ఉండేదని మమతా బెనర్జీ, అఖిలేష్‌యాదవ్‌లు స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌లో సీట్ల పంపకంలో కాంగ్రెస్‌, సమాజ్‌వాది పార్టీల మధ్య వాగ్వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.

➡️