ఐఒసి ఛైర్మన్‌ పదవికి శ్యామ్‌ పిట్రోడా రాజీనామా

May 9,2024 00:08 #Shyam Pitroda resigns

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రవాస భారతీయుల విభాగం ఇండియన్‌ ఓవర్‌సీస్‌ కాంగ్రెస్‌ (ఐఒసి) ఛైర్మన్‌ పదవికి శ్యామ్‌ పిట్రోడా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను కాంగ్రెజ్‌ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ఆమోదించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ సోషల్‌ మీడియాలో ప్రకటించారు. కాగా, పిట్రోడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారతీయులందరూ సోదరభావంతో కలిసిమెలిసి జీవిస్తారని, భిన్నత్వంలో ఏకత్వమనేది భారత విశిష్ట లక్షణమని తెలిపారు. భిన్నత్వం గురించి ఆయన ప్రస్తావిస్తూ.. ఈశాన్య ప్రాంత ప్రజలు చైనీయులు మాదరిగానూ, పశ్చిమ ప్రాంత ప్రజలు ఆరబ్‌లుగానూ, దక్షిణ ప్రాంత ప్రజలు ఆఫ్రికన్లు మాదరిగానూ కనిపిస్తారని పేర్కొన్నారు. అయితే ఈ వైవిధ్యాన్ని దేశ ప్రజలంతా ఆహ్వానిస్తారని తెలిపారు. ‘మనమంతా సోదరులం. మనమంతా వివిధ భాషలు, వివిధ మతాలు, విభిన్న దుస్తులు, ఆహారాన్ని ఆమోదిస్తాం’ అని పిట్రోడా చెప్పారు. అయితే పిడ్రోడా వ్యాఖ్యలు ‘వర్ణ’ వివక్షకు అద్దం పడుతున్నాయంటూ బిజెపి, సంఫ్‌ు పరివార్‌ పెడార్థాలు తీసి వివాదం రాజేసింది. ప్రధాని మోడీ సైతం విమర్శలు గుప్పించారు. పిట్రోడా వ్యాఖ్యలకు ‘యువరాజు’ రాహుల్‌ గాంధీ సమాధానమివ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఐఒసికి పిట్రోడా రాజీనామా చేశారు.

➡️