నిందితులపై ఉపా కేసులు

Dec 15,2023 10:23 #accused, #against, #Sub-cases
  • ఏడు రోజుల పోలీసు కస్టడీ
  • లోక్‌సభ సెక్రటేరియట్‌కు చెందిన 8 మంది అధికారులపై సస్పెన్షన్‌ వేటు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బుధవారం నాటి ఘటనకు సంబంధించి అరెస్టు చేసిన నలుగురు నిందితులపై పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం (ఉపా) కింద కేసు నమోదు చేశారు. వీరిని గురువారం పాటియాలా హౌస్‌ కోర్టులో అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు ఎదుట హాజరుపర్చారు. నిందితులను ముంబై, లక్నోకు తీసుకెళ్లాల్సి ఉందని 15 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా, న్యాయమూర్తి హర్‌దీప్‌ కౌర్‌ వారం రోజులకు మాత్రమే అనుమతించారు. ఈఘటనల వెనక ఆరుగురి ప్రమేయం ఉందని, ఐదుగురిని అరెస్టు చేశామని పోలీసులు కోర్టుకు తెలిపారు. అరెస్టయిన వారిలో డి.మనోరంజన్‌, సాగర్‌, అమోల్‌ షిండే, నీలందేవిలను బుధవారం అదుపులోకి తీసుకోగా, మరో నిందితుడు విశాల్‌ను గురుగ్రామ్‌లో అరెస్ట్‌ చేశారు. మరో నిందితుడు లలిత్‌ కోసం గాలిస్తున్నారు.

పాస్‌లు జారీ అయింది ఇలాగే..

లోక్‌సభ ఘటనలో నిందితులకు బిజెపి మైసూరు ఎంపి ప్రతాప్‌ సింహా కార్యాలయం నుంచి సందర్శకుల పాస్‌లు జారీ అయ్యాయి. లోక్‌సభలో సందర్శకుల గ్యాలరీ నుంచి దూకిన డి.మనోరంజన్‌ మైసూరుకు చెందిన వాడని, తరచూ ఎంపి ఆఫీసుకు వస్తుండేవాడని అధికార వర్గాలు తెలిపాయి. విజిటర్స్‌ పాస్‌ కోసం మనోరంజన్‌ మూడు నెలలుగా ఎంపి ఆఫీసును సంప్రదిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆయనతో పాటు సభలో బెంచ్‌లపై నుంచి దూకుతూ స్పీకర్‌ చాంబర్‌ వైపు దూసుకెళ్లిన సాగర్‌ శర్మను మనోరంజన్‌ తన స్నేహితుడని చెప్పి, పాస్‌ తీసుకున్నట్లు గుర్తించారు. బుధవారం సింహా తరపున మొత్తం మూడు పాస్‌లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మరో మహిళకు పాస్‌ ఇచ్చినప్పటికీ.. ఆమె తన కుమార్తెతో కలిసి రావడం, చిన్నారి పేరు పాస్‌లో లేకపోవడంతో అనుమతించలేదని ఎంపి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

రెక్కీ నిర్వహించింది మనోరంజనే..

ఈ ఘటన మొత్తానికి వ్యూహకర్త (మాస్టర్‌మైండ్‌) మనోరంజనేనని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది వర్షాకాల సమావేశాల సమయంలో మనోరంజన్‌ పార్లమెంట్‌ వద్ద రెక్కీ నిర్వహించినట్లు ఈ వర్గాలు తెలిపాయి. పార్లమెంట్‌లో సిబ్బంది బూట్లను తనిఖీ చేయడం లేదనే విషయాన్ని అప్పుడే మనోరంజన్‌ గుర్తించాడు. ఈ ఘటన సమయంలో లలిత్‌ కూడా పార్లమెంట్‌ ప్రాంగణంలోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పార్లమెంట్‌ సమీపంలో నీలమ్‌, అమోల్‌ ఆందోళన చేస్తుండగా ఆ వీడియోను లలిత్‌ ఫోన్లో రికార్డ్‌ చేసినట్లు తెలిసింది. భద్రతా సిబ్బంది వారిని పట్టుకోగానే.. నిందితులందరి ఫోన్లతో లలిత్‌ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం ఆ వీడియోను పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ ఎన్‌జిఒ సభ్యురాలికి పంపినట్లు సమాచారం. గతంలో తమతోపాటు ఎన్‌జిఒ సంస్థలో పనిచేసిన లలిత్‌ ఘటనకు సంబంధించిన వీడియో షేర్‌ చేసి, వైరల్‌ చేయాలని మెసేజ్‌ పెట్టినట్లు ఆమె మీడియాకు తెలిపారు. బుధవారం పార్లమెంటులో ఇద్దరు దుండగులు పొగబాంబులు పేల్చిన ఘటన అనంతర పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన గురువారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైనవారిలో కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఇతర మంత్రులు ప్రహ్లాద్‌ జోషి, అనురాగ్‌ ఠాకూర్‌, పియూష్‌ గోయెల్‌, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా తదితరులు హాజరయ్యారు.

భద్రత కట్టుదిట్టం… పార్లమెంట్‌లో ఆంక్షలు

పార్లమెంటు ప్రాంగణం.. బయట అధికారులు భద్రతను పెంచారు. ఢిల్లీ పోలీస్‌, పారా మిలిటరీ, పార్లమెంట్‌ స్పెషల్‌ సెక్యూరిటీ గార్డులతో పహార నిర్వహిస్తున్నారు. పార్లమెంట్‌ వైపు వెళ్లే ప్రతి వాహనాన్ని వ్యక్తులను భద్రతా సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. పార్లమెంట్‌ పాసులు ఉన్న వారికి మాత్రమే పరిసర ప్రాంతాల్లోకి వెళ్లే అవకాశం పోలీసులు ఇస్తున్నారు. పార్లమెంట్‌ భవనానికి వెళ్లే మార్గాలన్నింట్లో అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. పార్లమెంట్‌ భవనంలోకి ప్రవేశాలపై ఆంక్షలు విధించారు. ఎంపిలు ప్రవేశించే ‘మకర ద్వారం’ నుంచి ఇతరులు వెళ్లకుండా నిషేధం విధించారు. మకర ద్వారం వద్ద వంద మీటర్ల దూరంలో ఉండాలని మీడియాపై ఆంక్షలు విధించారు. ముందస్తు భద్రతా తనిఖీలు నిర్వహించి మీడియా సిబ్బందికి పాసులు జారీ చేస్తున్నారు. పార్లమెంట్‌కు వచ్చిన ప్రతి ఒక్కరి బూట్లను కూడా స్కాన్‌ చేస్తున్నారు. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాలు ముగిసే వరకు ఈ నిషేధాజ్ఞలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.

➡️