న్యూస్‌క్లిక్‌ కేసులో ఢిల్లీ పోలీసులకు, దర్యాప్తు సంస్థలకు సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ : దాడుల సందర్భంగా జర్నలిస్టుల వ్యక్తిగత డిజిటల్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్న సమయంలో పారదర్శకత లోపించిందని, అనుసరించాల్సిన ప్రక్రియ ఏదీ అనుసరించలేదని ఆన్‌లైన్‌ పోర్టల్‌ న్యూస్‌క్లిక్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం దర్యాప్తు సంస్థలకు, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. జస్టిస్‌ బి.ఆర్‌.గవారు నేతృత్వంలోని బెంచ్‌ ముందు న్యూస్‌క్లిక్‌ తరపున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ తన వాదనలు వినిపిస్తూ, ”చట్టపరంగా అనుసరించాల్సిన క్రమమేదీ పాటించలేదు. ఎలాంటి పత్రాలు ఇవ్వలేదు. ఏదీ జరగలేదు.” అని చెప్పారు. గతేడాది అక్టోబరులో న్యూస్‌క్లిక్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థ నివాసం, కార్యాలయాలపై ఢిల్లీ పోలీసులు దాడి చేసి ఆయనను యుఎపిఎ కేసులో ఆరెస్టు చేశారు. పిటిషనర్‌ ఎందుకు నేరుగా సుప్రీం కోర్టునే ఆశ్రయించారని జస్టిస్‌ గవారు ప్రశ్నించారు. దానిపై సిబల్‌ స్పందిస్తూ, వ్యక్తిత డిజిటల్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకోవడంపై మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ ఫౌండేషన్‌ ఆఫ్‌ మీడియా ప్రొఫెషనల్స్‌, ఐదుగురు విద్యావేత్తలు పెట్టుకున్న ఇటువంటి పిటిషన్లు ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగ్‌లో వున్నాయని, అందుకే తాము కూడా సుప్రీంనే ఆశ్రయించామని చెప్పారు. వెంటనే కోర్టు, న్యూస్‌క్లిక్‌ కేసును కూడా ఆ పిటిషన్లతో కలిపివేసింది. విద్యావేత్తలు, మీడియా వ్యక్తులపై దాడులు జరిపిన సందర్భాల్లో వారి ఎలక్ట్రానిక్‌ పరికరాలు స్వాధీనం చేసుకున్నప్పుడు వాటిల్లోని వ్యక్తిగత డేటాను సమగ్రతను కాపాడేందుకు సిబిఐ మాన్యువల్‌లోని ఆదేశాలకు కట్టుబడి వుండాలంటూ డిసెంబరు 14న మరో సుప్రీం బెంచ్‌ కేంద్రాన్ని ఆదేశించింది. కొత్త మార్గదర్శకాలు జారీ చేసేందుకు కసరత్తు జరుగుతోందని ఆ సమయంలో కేంద్రం తెలిపింది. ఇందుకు కనీసం మూడు మాసాలు పడుతుందని చెప్పింది. దాంతో ఆ పిటిషన్లపై విచారణను ఫిబ్రవరి 6కి వాయిదా వేసింది.

➡️